నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

తెలంగాణలోని దుబ్బాక సహా దేశంలోని మొత్తం 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 11 రాష్ట్రాల్లోని 54 స్థానాల్లో నవంబర్.........

Updated : 29 Sep 2020 19:29 IST

56 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌

దిల్లీ: తెలంగాణలోని దుబ్బాక సహా దేశంలోని మొత్తం 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 54 స్థానాల్లో నవంబర్ 3న.. బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానం సహా మణిపూర్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. బిహార్‌ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నవంబర్‌ 10న జరగనుంది. దుబ్బాకలో తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. 

దుబ్బాక ఉప ఎన్నిక ముఖ్య తేదీలివే..

* గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అక్టోబర్‌ 9న  

* నామినేషన్లకు ఆఖరి గడువు- అక్టోబర్‌ 16

* నామినేషన్ల పరిశీలన - అక్టోబర్‌ 17

* నామినేషన్ల ఉపసంహరణ గడువు - అక్టోబర్‌ 19

* పోలింగ్‌ తేదీ - నవంబర్‌ 3

* ఓట్ల లెక్కింపు తేదీ- నవంబర్‌ 10

ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలివే..

మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లోనే అత్యధికంగా 27 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.  ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, హరియాణా, కర్ణాటక, మణిపూర్‌, నాగాలాండ్‌, ఒడిశా, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 

మరో 7 స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు

కరోనాతో నెలకొన్న పరిస్థితులు, వాతావరణం, బలగాల తరలింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మరో నాలుగు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. వాటిని వచ్చే ఏడాదిలో నిర్వహిస్తామన్నారు. నవంబర్‌లో జరగబోయే ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లోనే అత్యధిక స్థానాలకు జరగనున్నాయి. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి భాజపా శిబిరానికి వెళ్లడంతో చోటుచేసుకున్న పరిణామాలతో అక్కడ 27 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని