Telangana News: తెరాస కార్యక్రమాల్లో ఇతర పార్టీలు ఆందోళన చేస్తే ఊరుకుంటారా?: రఘునందన్‌రావు

దుబ్బాక నియోజకవర్గం గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళ్తే తెరాస నేతలు అడ్డుకున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.

Updated : 01 Apr 2022 17:48 IST

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళ్తే తెరాస నేతలు అడ్డుకున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. స్వయంగా తాను ఫోన్ చేసి బందోబస్తు కల్పించాలని సిద్దిపేట ఏసీపీని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై మహిళలు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ ఈ విషయాలను తెలిపారు. తెరాస నిర్వహించే సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నాపై భౌతికదాడి చేసేందుకు వస్తే పోలీసులు నియంత్రించలేదని మండిపడ్డారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు డీజీపీని కలిసి పోలీసులు వ్యవహరించిన తీరును వివరించనున్నట్లు చెప్పారు.

మిరుదొడ్డి పోలీసు స్టేషన్‌లో తాను ఉంటే.. గేటు బయట తెరాస నేతలతో ఏసీపీ సంప్రదింపులు జరిపారని రఘునందన్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేదు కానీ.. కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 మంది పోలీసులు భద్రత కల్పించారని దుయ్యబట్టారు. శిలాఫలకం కూల్చిన వ్యక్తులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదో సిద్దిపేట ఏసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. శిలాఫలకం కూల్చిన వారిపై, తనపై దాడికి యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అధికార కార్యక్రమానికి వెళ్ళిన తనపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రఘునందన్‌ ఆక్షేపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని