Eatala: వేరే పార్టీ గుర్తుపై గెలిస్తే మంత్రి పదవులా.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం కేసీఆర్‌: ఈటల

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. దేశం అదోగతి పాలవుతుందని సీఎం కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆయన వ్యక్తం చేసిన అదే బాధను తెలంగాణలో తాము అనుభవిస్తున్నామని చెప్పారు.

Published : 06 Nov 2022 01:23 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. దేశం అధోగతి పాలవుతుందని సీఎం కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆయన వ్యక్తం చేసిన అదే బాధను తెలంగాణలో తాము అనుభవిస్తున్నామని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మండిపడ్డారు. లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. అలాంటి రాష్ట్రంలో కేసీఆర్‌.. నియంతలా రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆణిముత్యాలు అవుతారో రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం, మర్యాద విపక్ష నేతలకూ ఉండేది. కాంగ్రెస్ హయాంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి మంత్రులు వచ్చే సమాచారం ఇచ్చి, మేము అడిగిన పనులు చేసేవారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగదని తెరాస బెదిరింపులకు గురి చేస్తోందనేది నిజం కాదా? మరి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? రాష్ట్రం ఏర్పాటైన వెంటనే పలు ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధించలేదా? సీఎం కేసీఆర్‌ రాసిన స్క్రిప్ట్‌ను కొన్ని ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని చూపిస్తున్నాయి. ప్రజలపై ప్రేమతో కేసీఆర్‌ ఏ సంక్షేమ పథకం తీసుకురాలేదు. కేవలం ఓట్ల కోసమే కొత్త పథకాలు తీసుకొచ్చారు. మునుగోడులో నైతికంగా కేసీఆర్ ఓడిపోయారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవడం ఖాయం’’ అని ఈటల తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని