
శాసనసభ సభ్యత్వానికి ఈటల రాజీనామా
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే తెరాసకు గుడ్‌బై చెప్పిన ఆయన తాజాగా శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి అనుచరులతో గన్‌పార్క్ చేరుకొన్న ఆయన ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమతో కలిసి.. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభాపతి కార్యాలయంలో ఈటల రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగానని.. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు
హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు యుద్ధం..
హుజూరాబాద్‌లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని ఈటల అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు. సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని చెప్పారు. కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
నియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా..
'' తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడాం. అనేక మంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి నిన్సుగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోంది. వడ్లు తడిచి మొలకలు వచ్చినా పట్టించుకోరు. యువతకు ఉపాధి లేకపోయినా స్పందించరు. కానీ నన్ను చక్రబంధంలో పెట్టాలి అని పోలీసు అధికారులను వాడుతున్నారు. నాకు నిర్బంధాలు కొత్తకాదు.. నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే నా ఎజెండా. అందరూ హుజురాబాద్ ప్రజలకు అండగా ఉండండి. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా.
హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా..
సభాపతిని కలిసి రాజీనామా పత్రం అందజేయాలని భావించా.. కానీ ఆయన అందుబాటులో లేరు. అనివార్య పరిస్థితుల్లో అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేశా. నా అనుచరులతో పాటు మాజీ ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీలోకి అనుమతించలేదు. నాతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబు, కేశవరెడ్డి, గండ్ర నళిని భాజపాలో చేరతారు. మరో ఆత్మ గౌరవ పోరాటానికి సన్నద్ధం అవుతాం. మొట్టమెదటిగా హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తా '' అని ఈటల అన్నారు.
భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల ఈనెల 14న భాజపాలో చేరడం ఖాయమైంది. తొలుత పలు పార్టీల నేతలో చర్చించిన ఆయన భాజపాలో చేరడానికే ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు ఇప్పటికే దిల్లీ వెళ్లి ఆ పార్టీ అగ్రనేతలను సైతం కలిసి వచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.