Updated : 04 Jun 2021 12:20 IST

TS News:19 ఏళ్ల అనుబంధానికి రాజీనామా: ఈటల

హైదరాబాద్‌: తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.  హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు.

అప్పుడు ధర్మాన్ని.. ఇప్పుడు అణచివేతలను..

‘‘అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ప్రజలు గెలిపించారు.  అప్పుడు కేసీఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా? ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.

వారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా..

అన్ని సంఘాలకు హక్కులు లేకుండా చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేసిన చరిత్ర వీరిదే. తెలంగాణలో సమ్మెలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఇవాళ మనం చేసే పని సమైక్య పాలనలో చేసి ఉంటే తెలంగాణ వచ్చేదా? రైతుబంధును ఆదాయపన్ను చెల్లించేవారికి ఇవ్వొద్దని.. వ్యవసాయం చేయనివారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పాను. పొలం సాగు చేస్తున్నరైతులకు రైతుబంధు ఇస్తే బాగుంటుందని చెప్పా. బంగారు తెలంగాణ సాధించాలంటే గ్రామాలు బాగుపడకుండా సాధ్యం కాదు. రాష్ట్రంలో ధాన్యం కొనే స్థాయి రైస్‌ మిల్లర్లకు లేదు.. రాదు కూడా. ఐకేపీ కేంద్రాలు ఉంటాయి.. ధాన్యం కొంటారని చెప్పా.. ఇదేమైనా తప్పా? 

నయీం బెదిరించినా భయపడలేదు

చాలా విషయాలపై మాట్లాడుతున్నాననే నాపై కుట్రలు చేశారు. నేనెప్పుడూ భయపడలేదు.. భయపడను కూడా.. నయీం రెక్కీ నిర్వహించి బెదిరించినా భయపడలేదు. వందల మంది బలిదానాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుట్రలతోనే ఎంతో మందిని పార్టీ నుంచి బయటకు పంపారు.  నాపై తప్పుడు రాతలతో కుట్రలు, కుతంత్రాలు చేశారు. కష్టపడి పనిచేస్తేనే నాకు పదవులు ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అయినా స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? నేను చెబుతోంది నూటికి నూరు శాతం వాస్తవాలే. 

ఎమ్మెల్యేలపై లేని నమ్మకం.. 4కోట్ల ప్రజలపై ఉంటుందా?

నేను బానిసను కాదు.. ఉద్యమ సహచరుడిని. నక్సల్స్‌ తరహాలో తెరాస అజెండా ఉంటుందని కేసీఆర్‌ ఎన్నోసార్లు చెప్పారు. విరసం నేత వరవరరావు జైలులో ఉంటే కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్‌ హయాంలో నేను తెచ్చుకున్న గోదాములు మూసివేయించారు.119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది మంత్రులపై నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలపై నమ్మకముంటుందా? మెజార్టీ ఉన్నప్పటికీ తెదేపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎందుకు కొన్నారు? 2018 ఎన్నికల తర్వాత ఇన్నిసీట్లు వస్తాయని ఊహించలేదని మీడియా సమావేశంలో చెప్పా. ఆ మాటలను కూడా వక్రీకరించారు. నా నెత్తిని కొట్టే ప్రయత్నం చేశారు.. తప్పకుండా మీ నెత్తిని కూడా కొట్టేవారు ఉంటారు. ఎమ్మెల్యే పదవి నుంచి మీరు తీసే ముందు నేనే తప్పుకుంటా. తెలంగాణ సమాజంలో నేను సంపాదించుకున్న పేరును దెబ్బతీసే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్‌ ప్రజలు డబ్బు సంచులను, కుట్రలు, కుతంత్రాలను బొందపెడతారు. జర్నలిస్ట్‌ రఘు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయనపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు నేను దూరం కాను. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని ఈటల చెప్పారు.

ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీఛైర్‌పర్సన్‌ తుల ఉమ సహా పలువురు నేతలు తెరాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఈటల ప్రకటించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని