Assembly Elections: 5 రాష్ట్రాలకు మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ను ప్రకటించింది.

Published : 09 Jan 2022 01:56 IST

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం 7 దశల్లో పోలింగ్‌

మార్చి 10న ఫలితాలు

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్‌ను ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం విజ్ఞాన్‌ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) సుశీల్‌ చంద్ర.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ జరపనున్నట్లు సీఈసీ తెలిపారు. మార్చి 10న కౌటింగ్‌ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు.

యూపీలో 7 విడతల్లో.. మణిపుర్‌లో 2 దశల్లో

ఉత్తరప్రదేశ్‌కు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవాకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. ఇక మణిపుర్‌ రాష్ట్రానికి ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 7న చివరి దశ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. 

ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా.. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపుర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.

పోలింగ్‌ సమయం గంట పెంపు..

ఈ సందర్భంగా సీఈసీ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘కరోనా ఉద్ధృతి వేళ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలే. దీనిపై ప్రభుత్వంతో పాటు నిపుణులతోనూ చర్చించాం. కొవిడ్‌ రహిత పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లతో పాటు సిబ్బందిని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 18.34కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు సీఈసీ తెలిపారు. ఇందులో 8.55కోట్ల మంది మహిళా ఓటర్లు, 24.9లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను 16శాతం పెంచినట్లు పేర్కొన్నారు. పోలింగ్‌ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్లు తెలిపారు. ఇక పోలింగ్‌ విధుల్లో పాల్గొనేవారికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పరిగణించి.. వారికి కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఆన్‌లైన్‌ నామినేషన్లకు అవకాశం..

మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చని తెలిపారు. దీని వల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.40లక్షలకు పెంపు..

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ. 40లక్షలకు పెంచుతున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఇక క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులను ఎందుకు ఎన్నుకున్నారో కారణాలు కూడా చెప్పాలని తెలిపారు.

జనవరి 15 వరకు రోడ్‌షోలు రద్దు..

కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ వర్చువల్‌గా ప్రచారం నిర్వహించుకోవాలని సీఈసీ సూచించారు. జనవరి 15 వరకు ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రల వంటి బహిరంగ ప్రచారాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత పరిస్థితులను సమీక్షించి ప్రచారాలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని