Wayanad: వయనాడ్‌ ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు.. ఇది రాజకీయ కుట్ర: కాంగ్రెస్‌

వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతుండటంపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇదంతా రాజకీయకుట్రలో భాగమని ఆరోపించింది.

Published : 08 Jun 2023 20:28 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల కానప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్‌లను సిద్ధం చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. ఈవీఎంల పని తీరును సరిచూసుకున్న తర్వాత మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తామంటూ కొయ్‌కోడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇప్పటికే సమాచారమిచ్చారు. పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈసీ ఉపఎన్నికకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.

మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు నుంచి రాహుల్‌పై అనర్హత అమల్లోకి వస్తుందంటూ లోక్‌సభ సెక్రెటేరియేట్‌ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 102(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌సింగ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తుండటంపై కాంగ్రెస్‌ నాయకత్వం మండిపడింది. ఇది రాజకీయ కుట్రలో భాగమని విమర్శించింది. ఎన్నికల సంఘం చర్య వెనుక ‘రహస్యం’ దాగి ఉందని ఆరోపించింది. ఈ కేసు విషయంలో రాహుల్‌ గాంధీ వేసిన పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా న్యాయస్థానం ఏం చెబుతుందో ఈసీ ఎలా అంచనా వేయగలదని ప్రశ్నించింది. 

‘‘ రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్‌ హైకోర్టు  తీర్పు వెలువడక ముందే వయనాడ్ లోక్‌సభకు ఉపఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందులో ఏదో రహస్యం ఉంది. కచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే.’’అని డీసీసీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఎవరి సూచనల మేరకు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించాలని భావిస్తోందో భారత ప్రజలు తెలుకోవాలనుకుంటున్నారని కేపీసీసీ జనరల్‌ సెక్రెటరీ కుళనందన్‌ అన్నారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. లోక్‌సభలో అదానిపై మాట్లాడటం వల్లే రాహుల్‌ గాంధీపై భాజపా ప్రభుత్వం కక్ష పెంచుకుందని చెప్పారు. భాజపా ఎత్తుగడ రాహుల్‌ను మరింత బలంగా మార్చేందుకు సహాయపడింది తప్ప.. అంతకుమించి ఇంకే లేదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందడమే అందుకు నిదర్శనమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని