ఆ 5 రాష్ట్రాల్లో రోడ్‌ షోలకు ‘నో’.. వెయ్యి మందితో బహిరంగ సభకు ఈసీ ఓకే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ ......

Updated : 31 Jan 2022 16:47 IST

దిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పార్టీలు/అభ్యర్థుల రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌/బైక్‌ ర్యాలీలపై నిషేధం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 11 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అలాగే, ఒమిక్రాన్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా జనవరి 8న విధించిన పలు ఆంక్షలకు మరికొన్ని సడలింపులు ఇచ్చింది. అధికారుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లో బహిరంగ సభలకు గతంలో 500 మందికి మాత్రమే అనుమతించిన ఈసీ.. ఈసారి ఆ సంఖ్యను 1000కి పెంచింది. అలాగే, ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకు బృందంగా వెళ్లొచ్చని స్పష్టంచేసింది. అలాగే, ఇండోర్‌లలో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి మించరాదని పరిమితి విధించిన ఈసీ.. ఈసారి ఆ సంఖ్యను 500వరకు పెంచింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. 

సోమవారం ఉదయం  11గంటల నుంచి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు, ఐదు రాష్ట్రాల సీఎస్‌లు, ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్షించారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలను కూలంకుషంగా చర్చించడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించారు. అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాజా ఆదేశాలు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని