Sanjay Raut: ఈడీ నోటీసులు.. మాకు ప్రేమ లేఖలు: సంజయ్‌ రౌత్‌

రాజకీయ కార్యకర్తలకు దర్యాప్తు సంస్థల నోటీసులు ప్రేమ లేఖలే గానీ.. డెత్‌ వారెంట్లు కాదన్నారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి

Published : 31 Aug 2021 01:44 IST

ముంబయి: రాజకీయ కార్యకర్తలకు దర్యాప్తు సంస్థల నోటీసులు ప్రేమ లేఖలే గానీ.. డెత్‌ వారెంట్లు కాదన్నారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి అనిల్‌ పరబ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేయడంపై స్పందించిన ఆయన.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చలేకనే.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

మహారాష్ట్రలో మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తదితరులపై నమోదైన రూ. 100కోట్ల ఆర్థిక అక్రమాల కేసులో విచారణ నిమిత్తం మంగళవారం తమ ఎదుట హాజరుకావాలంటూ శివసేన నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్‌ పరబ్‌కు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. దీనిపై సంజయ్‌ రౌత్‌ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈడీ కార్యాలయంలో భాజపా మనిషి డెస్క్‌ ఆఫీసర్‌గా అయినా పనిచేస్తుండాలి.. లేదంటే ఈడీ ఆఫీసర్‌ భాజపా ఆఫీసులోనైనా పనిచేస్తుండాలి అని ఎద్దేవా చేశారు. ‘‘మాలాంటి రాజకీయ కార్యకర్తలకు ఈడీ నోటీసులు ప్రేమ లేఖలే గానీ.. డెత్‌ వారెంట్లు కాదు. బలమైన, అజేయమైన మహా వికాస్‌ అఘాడీ గోడను పగలగొట్టేందుకు చేసిన అనేక విఫలయత్నాల తర్వాత ఇలాంటి ప్రేమలేఖల తాకిడి పెరిగింది. అనిల్‌ పరబ్‌ను భాజపా నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే, ఈ నోటీసులకు ఆయన స్పందిస్తారు. ఈడీకి సహకరిస్తారు’’ అంటూ రౌత్‌ వ్యాఖ్యలు చేశారు.

అనిల్‌ పరబ్‌ ఇంఛార్జి మంత్రిగా ఉన్న రత్నగిరి జిల్లాలో ఇటీవల కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ పరిణామాల పర్యవసానంగానే అనిల్‌ పరబ్‌కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయని శివసేన కేంద్రంపై విమర్శలు చేస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని