ప్రజాస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వ వెన్నుపోటు

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తోందని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు. ప్రధాని మోదీ స్నేహితుడు అయినందునే అదానీపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు.

Published : 07 Feb 2023 07:08 IST

భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తోందని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు విమర్శించారు. ప్రధాని మోదీ స్నేహితుడు అయినందునే అదానీపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతివ్వడం లేదని ఆరోపించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ భారాస ఎంపీలు ఉభయ సభల్లో సోమవారం వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌తో పాటు రాజ్యసభ ఛైర్మన్‌ కూడా వాటిని తోసిపుచ్చారు. అనంతరం భారాస ఎంపీలు తెలంగాణ భవన్‌కు చేరుకొని విలేకరులతో మాట్లాడారు. కేశవరావు మాట్లాడుతూ.. సభ ఆర్డర్‌లో లేదనే సాకుతో వాయిదా తీర్మానాలు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. అదానీ అతి తక్కువ సమయంలో అత్యధిక ధనవంతుడిలా ఎలా ఎదిగారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓ వ్యక్తి దేశాన్ని దోచుకుంటుంటే చట్టసభల్లో చర్చ చేయరా? అని ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చ జరిగితే అదానీ షేర్లు పడిపోతాయని భాజపా భయపడుతోందన్నారు. చర్చకు దూరంగా ఉండడాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వమే అదానీకి అండగా ఉన్నట్లు కనపడుతోందని అన్నారు. భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ రైతు, పేదల వ్యతిరేకమైతే రాష్ట్ర బడ్జెట్‌ రైతులు, పేదల పక్షమని కొనియాడారు. హైదరాబాద్‌ రూపురేఖలను మార్చే రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు (ఆర్‌ఆర్‌ఆర్‌) కేంద్రం పూర్తిగా సహకరించడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీలు పి.రాములు, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు