Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిందే.. నేడే ప్రమాణం

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేయనున్నారు

Updated : 30 Jun 2022 19:04 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ గురువారం వెల్లడించారు. ఈ మధ్యాహ్నం ఫడణవీస్‌, శిందే కలిసి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఈ అనూహ్య ప్రకటన వెలువడింది. ఈ సాయంత్రం 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో శిందే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఫడణవీస్‌ వెల్లడించారు.  

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమిపై ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో నెలకొన్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఠాక్రే నిన్న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సభలో మెజార్టీని నిరూపించుకోవడం కష్టమని భావించి బలపరీక్షకు ముందే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఠాక్రే వైదొలగడంతో రాష్ట్రంలో మళ్లీ భాజపా సర్కారు ఏర్పడుతుందని అంతా భావించారు. శిందే మద్దతుతో దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. సీఎంగా ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా శిందే నేడు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఈ మధ్యాహ్నం శిందే గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫడణవీస్‌ నివాసానికి వెళ్లారు. అనంతరం వీరిద్దరూ కలిసి రాజ్‌భవన్‌ను వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత ఫడణవీస్‌ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శిందే బాధ్యతలు చేపడుతారని, ఆయనకు భాజపా పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.

ప్రభుత్వంలో భాగం కాలేను: ఫడణవీస్‌

‘‘2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా - శివసేన కూటమికి ప్రజలు ఓటు వేశారు. కానీ ప్రజల తీర్పును అవమానించి శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందుత్వ, బాలాసాహెబ్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న కూటమి నుంచి బయటకు రావాలని శిందే వర్గం పదే పదే కోరింది. కానీ ఉద్ధవ్‌ ఠాక్రే పట్టించుకోలేదు. అందుకే వీరంతా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది’’ అని ఫడణవీస్‌ చెప్పుకొచ్చారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా శిందే నేడు ప్రమాణస్వీకారం చేస్తారంటూ అనూహ్య ప్రకటన చేయడం గమనార్హం. అయితే ఈ ప్రభుత్వానికి తాను దూరంగా ఉంటానని, శిందే-భాజపా సర్కారులో తాను భాగస్వామి కాబోనని తెలిపారు. అయితే శిందేకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

ఫడణవీస్‌ది పెద్ద మనసు: శిందే

అనంతరం ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ.. భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉంది. అయినా ఆయన పెద్ద మనసు చాటుకున్నారు సీఎం పదవికి నాకు అందించారు. ఫడణవీస్‌, ప్రధాని మోదీ, భాజపా అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని