Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే.. తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Published : 25 Jun 2022 11:14 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే.. తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శిందే గువాహటిలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో కూర్చొని తన బలం పెంచుకుంటుండగా.. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్ధవ్ వర్గం క్షేత్రస్థాయి కార్యకర్తలపై దృష్టి సారించింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం శివసేన జాతీయ కార్యవర్గంతో ముంబయిలో భేటీ కానున్నారు. మరోపక్క శిందే తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టారు. దానిలో భాగంగా  వారుంటున్న రాడిసన్ బ్లూ హోటల్‌లోనే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.

శిందే కంచుకోటలో నిషేధాజ్ఞలు..

ఇదిలా ఉంటే.. అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. శిందేతో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలున్న హోర్డింగ్‌లు, బోర్డులను ధ్వంసం చేసిన ఘటనలు వెలుగులోకివచ్చాయి. దీంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబయిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే శిందే కంచుకోటగా ఉన్న థానేలో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఆ నగరం మొత్తం 144 సెక్షన్‌ విధించారు. కర్రలు, ఆయుధాలతో తిరగడం, పోస్టర్లు, దిష్టిబొమ్మలు తగులబెట్టడం పూర్తిగా నిషేధం. స్పీకర్లలో నినాదాలు చేయడం, పాటలు పాడేందుకు అనుమతి లేదు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయి. 

ఇదిలా ఉండగా.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మొత్తం 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు ఈరోజు నోటీసులు అందజేయనున్నారు. జూన్ 26 సాయంత్రం 5 గంటలలోపు ఎమ్మెల్యేలు తమ స్పందనను తెలియజేయాలని కోరనున్నారు. మహారాష్ట్ర శాసనసభకు భౌతికంగా హాజరు కావాలని వారికి సూచించనున్నారు. అలాగే మరో నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన డిప్యూటీ స్పీకర్‌కు పేర్లు పంపిందని సీనియర్ నేత ఒకరు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని