Published : 01 Jul 2022 01:28 IST

Maharashtra Crisis: ఫడణవీస్‌ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?

ముంబయి: ఆశ్చర్యం.. అనూహ్యం.. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిందే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో రాజకీయవర్గాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఇప్పటివరకు ఫడణవీస్‌ సీఎంగా, ఏక్‌నాథ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. మొదట్లో ప్రభుత్వంలో చేరేందుకు ఫడణవీస్‌ నిరాకరించినా చివరకు భాజపా అధిష్ఠానం ఆదేశాలతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

ఆ అపవాదు నుంచి బయటపడేందుకు..

శివసేనకు చీలికలు కొత్త కాదు. అయితే ఈ సారి మాత్రం మెజార్టీ ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టారు. అయితే తెరవెనుక సూత్రధారి భాజపా అని ఉద్ధవ్‌తోపాటు కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే శివసేనకు ముంబయి, కొంకణ్‌, ఠాణె, మరాఠ్వాడా ప్రాంతాల్లో మంచి పట్టుంది. క్యాడర్‌ అలాగే ఉంది. దీనికి తోడు తటస్థంగా ఉన్న ఓటర్లు శివసేన వైపు రానున్న ఎన్నికల్లో సానుభూతితో మొగ్గుచూపితే శివసేనకు ఆధిక్యం లభిస్తుంది. ఈ అంశాలను పూర్తిగా విశ్లేషించిన భాజపా సీఎం పీఠానికి దూరంగా జరిగింది.

తిరుగుబాటు నేతలపైనే బరువు, బాధ్యతలు..

రాష్ట్రంలో ఇక శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు కూడా రానున్న రెండేళ్లలోనే ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా రిస్క్‌ తీసుకోదలుచుకోలేదు. ఒక వేళ కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. రెండేళ్లలో పెద్ద కార్యక్రమాలు చేపట్టలేరు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోపాటు సేనను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న అపవాదు వచ్చే ప్రమాదముంది. దీంతో అధికారాన్ని సేన తిరుగుబాటు దారులకే అప్పగించింది. ఒక వేళ ప్రభుత్వ వైఫల్యాలుంటే ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారుతుంది తప్ప భాజపాకు కాదు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట..

మధ్యప్రదేశ్‌.. తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సర్కార్లను కూల్చడంతో భాజపా దూకుడు ప్రదర్శించింది. అయితే రాష్ట్రంలో మాత్రం  సంయమనంగా వ్యవహరించి సేన అంతర్గత విభేదాలతోనే ప్రభుత్వం కూలిపోయేట్టు వ్యవహరించింది. దీంతో తమద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిందని.. ప్రధానంగా సీఎం పదవికి దూరంగా ఉండటం ద్వారా తాము ఎలాంటి తెరచాటు యత్నాలు చేయలేదని నిరూపించేందుకు యత్నిస్తోంది.

రిమోట్‌ కంట్రోల్‌ మాత్రం భాజపాతోనే..

2019 ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు శివసేన చీలిపోవడంతో హిందూ అనుకూల పార్టీల్లో భాజపాదే పైచేయికానుంది. రానున్న ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయని భాజపా ఆశిస్తోంది. అయితే శిందే సర్కారు పూర్తిగా భాజపాపై ఆధారపడాల్సిందే. భాజపాకు శాసనసభలో ఉన్న సంఖ్యాబలమే అందుకు ఉదాహరణ. మరో వైపు రాష్ట్రంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు బలహీనంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా దూకుడు కంటే ఓపికగా ఉండటమే మేలని భాజపా భావించింది. అందుకునే డిప్యూటీ సీఎం పదవిని దేవేంద్ర చేపట్టారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని