Shivsena: శివసేన గుర్తు అడిగే హక్కు శిందేకు లేదు: ఉద్ధవ్‌

పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయే వారికి పార్టీపేరుగానీ, పార్టీ గుర్తుగానీ అడిగే హక్కు లేదని  మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేశారు.

Published : 08 Oct 2022 01:43 IST

ముంబయి: శివసేన పార్టీ గుర్తుపై వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ‘విల్లు-బాణం’ గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్‌ ఠాక్రే, ఇటు సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గీయులు పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉంది. తాజాగా గుర్తు కేటాయింపుపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఉద్ధవ్‌ను ఎన్నికల సంఘం కోరింది. శనివారంలోగా తన స్పందన తెలియజేయాలని సూచించింది. దీనిపై స్పందించిన ఠాక్రే‌.. ‘‘శిందే, ఆయన వర్గీయులు పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోయారు. అందువల్ల వారికి పార్టీ పేరు గానీ, పార్టీ గుర్తు గానీ అడిగే హక్కు లేదు’’ అని ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈసీ విధించిన గడువు కంటే ఒక రోజు ముందే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తూర్పు అంధేరి నియోజవర్గానికి ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పార్టీ గుర్తుపై నిర్ణయం తీసుకోవాలంటూ గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున శిందే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ఈ అంశం ఇప్పుడు ఈసీ పరిధిలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని