Maharashtra Crisis: ఏ జాతీయ పార్టీ మాతో టచ్‌లో లేదు: ఏక్‌నాథ్‌ శిందే ‘యూ టర్న్‌’!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.  శివసేన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఉద్ధవ్‌ఠాక్రే నుంచి చేజారి ఏక్‌నాథ్‌ శిందే శిబిరంలోకి చేరుతున్న వేళ .....

Published : 24 Jun 2022 19:34 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.  శివసేన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఉద్ధవ్‌ఠాక్రే నుంచి చేజారి ఏక్‌నాథ్‌ శిందే శిబిరంలోకి చేరుతున్న వేళ అక్కడి పొలిటికల్‌ డ్రామా ఉత్కంఠ రేపుతోంది. తమ గ్రూపునకు ఓ జాతీయ పార్టీ ఎలాంటి సహాయమైనా చేస్తానని హామీ ఇచ్చిందంటూ నిన్న వ్యాఖ్యానించిన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ఈరోజు యూ టర్న్‌ తీసుకున్నారు. ఏ జాతీయ పార్టీ తమకు కాంటాక్టులో లేదన్నారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. నిన్నటి వ్యాఖ్యలతో రెబల్‌ ఎమ్మెల్యేలకు భాజపా మద్దతిస్తోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో ‘ఓ మహాశక్తి మా వెనుక ఉంది అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం శివసేన దివంగత నేత బాలా సాహెబ్‌ ఠాక్రే, ఆనంద్‌ డిఘేలా గురించే..’’ అని శిందే సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందని ప్రశ్నించగా.. కొంత సమయం తర్వాత అన్నీ తేలిపోతాయన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేలా డిప్యూటీ స్పీకర్‌ వద్దకు వెళ్లాలని శివసేన ప్రయత్నిస్తున్న తరుణంలో ఏక్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు గానూ 40మంది గువాహటిలో నాతోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, సంఖ్యా బలమే లెక్క. అందువల్ల మాపై చర్యలు తీసుకొనే హక్కు ఎవరికీలేదు’’ అన్నారు.

పోరాడతాం.. మేమే గెలుస్తాం..: ప్రియాంకా చతుర్వేది

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయం సంక్షోభంపై శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందించారు. తామంతా శివసైనికులమని.. పోరాడి విజయం సాధిస్తామని వ్యాఖ్యానించారు. రెబల్‌ ఎమ్మెల్యేలు చేస్తున్నది చట్టబద్ధమైనది కాదని.. రాజకీయంగానూ తగిన పనికాదన్నారు. శివసేనలో ఇలాంటి పరిస్థితులు రావడం  ఇదే తొలిసారి కాదన్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా ఫలించలేదని తెలిపారు. ఈసారి కూడా వారి ప్రయత్నాలు ఫలించవని విశ్వాసం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని