Updated : 05 Mar 2021 11:15 IST

బస్కీలు తీసినా.. స్కూటీ ఎక్కినా ఓట్లకోసమే

ఓటర్లతో కలిసిపోయేందుకు నేతల స్టంట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల పండగ వచ్చిందంటే రాజకీయ వేడి రాజుకుంటుంది. గెలుపు కోసం నేతల ఎత్తులు.. అభ్యర్థుల పరస్పర వాగ్బాణాలు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల జడివానలు షరామామూలే. త్వరలో ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రచారం హోరెత్తింది. అయితే ఈసారి నేతలు తమ పంథా కొంచెం మార్చారు. ఓవైపు హామీలు కురిపిస్తూనే ప్రజలతో మమేకమయ్యేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒకరు స్కూటీ ఎక్కితే.. మరొకరు బస్కీలు తీశారు. ఇంకొకరు కూలీగా మారారు.

రాహుల్‌.. గెలుపు ‘కసరత్తు’లు

వరుస ఓటములతో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి తాజా ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో అగ్రనేత రాహుల్‌గాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జాలర్లతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లిన రాహుల్‌.. ఆ తర్వాత తమిళనాడులోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. అంతేగాక, ఓ విద్యార్థినితో కలిసి బస్కీలు తీసి.. ఒంటిచేత్తో పుషప్స్‌ చేసి ఆకట్టుకున్నారు. 

దీదీ.. స్మృతి.. ఓ బైక్‌ రైడ్‌

ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌ కీలకంగా మారింది. ముఖ్యంగా హ్యాట్రిక్‌ కోసం మమతాబెనర్జీ, అధికార పీఠం కోసం భాజపా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల దీదీ.. చమురు ధరలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటీ నడుపుతుండగా ఆమె వెనకాల కూర్చుని సచివాలయానికి వెళ్లారు. ఆ మరుసటి రోజే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సందర్భంగా స్కూటీ నడిపిన స్మృతి.. మమతాబెననర్జీకి ధైర్యముంటే స్వయంగా బండి నడపాలని సవాల్‌ విసిరారు.

తేయాకు తోటల్లో ప్రియాంక ముచ్చట్లు

ఈశాన్య రాష్ట్రం అసోంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఈసారి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంది. ఆ బాధ్యతను రాహుల్‌ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీసుకున్నట్లున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించిన ప్రియాంక.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేనా.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారితో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. టీ తోటల్లో తలకు బుట్ట వేసుకుని కూలీలతో పాటు తేయాకు తెంచారు. నేలపై కూర్చుని వారితో మాట్లాడారు.

నేలపై నేతల భోజనం..

బెంగాల్‌లో అధికారం కోసం భాజపా అనేక కసరత్తులు చేస్తోంది. కేంద్రం నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాన్ని సందర్శించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తరచూ బెంగాల్‌ వెళ్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఓ పర్యటనలో మల్దా జిల్లాకు వెళ్లిన నడ్డా.. అక్కడ రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా మతువా కమ్యూనిటీ ప్రజలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. ఇటీవల ప్రధాని మోదీ కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మోదీ అస్సామీ గమోచా(శాలువా) ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక పుదుచ్చేరికి చెందిన నర్సు టీకా వేయగా.. ఆమె పక్కన ఉన్న మరో నర్సు కేరళకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. 

వీరే కాదండోయ్‌.. ఎన్నికల రాష్ట్రాల్లో ప్రతి గల్లిలోనూ ఇప్పుడు ఇలాంటి దృష్ట్యాలే కన్పిస్తాయి. నేతలు ఏంచేసినా.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకేగా మరి..!Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని