Uddhav Thakeray: పేరు, గుర్తునే దూరం చేశారు.. పార్టీని కాదు: ఈసీపై ఠాక్రే విమర్శలు!

శివసేన (Shiv Sena)ను పూర్తిగా తుడిచిపెట్టేయాలని భాజపా (BJP) ప్రయత్నిస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) విమర్శించారు. ఈసీ (EC) తమ నుంచి పార్టీ పేరు, గుర్తును మాత్రమే లాక్కుందని.. పార్టీని మాత్రం తమ నుంచి దూరం చేయలేరని అన్నారు.

Published : 06 Mar 2023 00:53 IST

ముంబయి: శివసేన (Shiv Sena)  పార్టీ పేరు, గుర్తును శిందే (Eknath Shinde) వర్గానికి కేటాయించడంపై ఎన్నికల సంఘం (EC)పై ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) మరోమారు విమర్శలు గుప్పించారు. మీరు మా నుంచి శివసేన పేరు, గుర్తును మాత్రమే దూరం చేశారని.. పార్టీని ఎప్పటికీ మా నుంచి దూరం చేయలేరని అన్నారు. ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి కేటాయించిన తర్వాత ఆయన మొదటిసారి రత్నగిరి జిల్లాలోని కేథ్‌ మున్సిపాలిటీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

‘‘ నేను మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చాను. ఈసీ సరిగా పనిచేస్తుంటే కిందిస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో చూడాలి. పదవిలో ఉన్నవారికి బానిసలాగా ఈసీ వ్యవహరిస్తోంది. వారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మీరు నా నుంచి పేరు, గుర్తు మాత్రమే లాక్కున్నారు. పార్టీని మాత్రం దూరం చేయలేరు. శివసేనను పూర్తిగా తుడిచిపెట్టేయాలని భాజపా (BJP) ప్రయత్నిస్తోంది’’ అని థాక్రే విమర్శించారు. పార్టీ పేరు, గుర్తు శిందే వర్గానికి కేటాయించడంపై ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

శివసేన వర్గంలో చీలిక తర్వాత నిజమైన శివసేన తనదేనని ప్రకటించాలని కోరుతూ ఆరు నెలల క్రితం శిందే.. ఈసీని ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన ఈసీ గత శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. శివసేన పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’.. శిందే వర్గానికి చెందుతుందని చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని