Uddhav Thackeray: ‘ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి’.. ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల సంఘాన్ని(Election commission) రద్దు చేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) అన్నారు. ఈరోజు తమకు జరిగినట్టే రేపు ఇంకెవరికైనా జరగొచ్చని.. ఇదే పరిస్థితి కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామం లేదా ఎన్నికలు జరగవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 20 Feb 2023 16:03 IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath sindhe)వర్గాన్నే అసలైన శివసేన(Shiv sena)గా గుర్తిస్తూ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వారికి కేటాయించిన ఈసీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శివసేన సస్పెండ్‌ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున పార్టీ పేరు, గుర్తు కేటాయింపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించిన ఠాక్రే.. ఎన్నికల కమిషనర్లను సైతం ప్రజలే ఎన్నుకోవాలన్నారు. తాము అభ్యర్థించినా అంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈసీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. మంగళవారం విచారణ జరుగుతుందని తెలిపారు. సుప్రీం కోర్టే తమకు చివరి ఆశాకిరణం అన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల సాయంతో ప్రజాస్వామ్యాన్ని భాజపా నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు. శివసేనను అంతమొందించాలన్న భాజపా కుట్రలో భాగంగానే తమ నుంచి పార్టీ పేరు, గుర్తును లాక్కొన్నారన్నారు. తమ నుంచి అన్నీ దోచుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును లాక్కున్నారు  గానీ.. ఠాక్రే పేరును మాత్రం దోచుకోలేరన్నారు. ఈరోజు తమకు జరిగినట్టే రేపు ఇంకే పార్టీలకైనా జరగొచ్చని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం గానీ ఎన్నికలు గానీ ఉండవు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేన (Shiv Sena)గా గుర్తిస్తూ వారికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దీన్ని అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని ఠాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోర్టును అభ్యర్థించగా.. అందుకు సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని పేర్కొన్న సీజేఐ.. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రావాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని