MCD Elections: సీన్‌ రిపీట్‌.. మరోసారి దిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

దిల్లీ మేయర్(Delhi Mayor) ఎన్నిక మరోసారి నిలిచిపోయింది. సభలో జనవరి ప్రారంభం నాటి సీనే రిపీట్‌ అయింది. 

Published : 24 Jan 2023 17:29 IST

దిల్లీ: దిల్లీ మేయర్(Delhi Mayor) ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఆప్‌(AAP), భాజపా(BJP) సభ్యుల మధ్య జరిగిన ఘర్షణే ఇందుకు కారణం. దాంతో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) సభ నిరవధికంగా వాయిదా పడింది. జనవరి ఆరున కూడా ఇదే రీతిలో ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది. ఆ రోజు సభలో సభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ మొదట 10మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్ ఎన్నికలో వారు ఓటువేయడానికి అనుమతి లేదని ఆప్‌ వెల్లడించింది. క్రితంసారి వారి ప్రమాణ స్వీకారం విషయంలోనే ఆప్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. మేయర్ ఎన్నికను భాజపాకు అనుకూలంగా మార్చేందుకు, ఉద్దేశపూర్వకంగానే వారిని నామినేట్‌ చేశారని విమర్శించింది. ఇదిలా ఉంటే.. జనవరి ప్రారంభంలో సభలో జరిగిన రసాభాసను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎంసీడీ(MCD) కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మార్షల్స్‌ను సిద్ధంగా ఉంచారు. 

కాగా, డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD Elections) ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. 15 ఏళ్ల భాజపా పాలనను ఆప్‌ ఊడ్చేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. ఆప్‌ తరఫున షెల్లీ ఒబెరాయ్‌(Shelly Oberoi) మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మొదట ఈ పదవి కోసం తాము పోటీ పడమని చెప్పిన భాజపా.. తర్వాత మాట మార్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని