Updated : 06 Apr 2021 13:58 IST

ఎన్నికల ‘మినీ సంగ్రామం’ నేడే 

దిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలు/ ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, అసోంలలో నేటి ఎన్నికల పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించింది. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా ఓటర్లు సురక్షితంగా ఓటుసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా.. బెంగాల్‌, అసోంలో మాత్రం మూడో విడత ఎన్నికలు మంగళవారం జరగనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు తమిళనాడులోని కన్యాకుమారి, కేరళలోని మలప్పురం లోక్‌సభ నియోజకవర్గాలకూ నేడు  పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీలు గుప్పించాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంచేయనున్నారు. 

తమిళనాట ఓటరు తీర్పు ఎటో!

తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తంగా 6,62,69,955 ఓటర్లు ఉండగా.. 88,937 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు లక్షా 58వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలకు 1.58లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్‌ బూత్‌ చొప్పున ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో కమల్‌హాసన్‌, దినకరన్‌ నేతృత్వంలోని కూటములు ఎంత మేర ప్రభావం చూపుతోందోనన్న ఆసక్తి నెలకొంది.

కేరళలో చరిత్ర లిఖిస్తారా?

మరోవైపు, కేరళలో 140 స్థానాలకు ఒకే దశలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 957మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో పాటు భాజపా ప్రధానంగా పోటీలో ఉన్నాయి. మొత్తంగా 2,74,46,039మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,41,62,025 మహిళలు కాగా.. 1,32,83,724 మంది పురుషులు ఉన్నారు. అలాగే, 290మంది ట్రాన్స్‌జెండర్‌లు కూడా ఉన్నారు. ఇక్కడ 1980ల నుంచి ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటములను అక్కడి జనం ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క కూటమికీ వరుసగా అధికారం ఇవ్వకుండా తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్న అక్కడి ఓటర్లు ఈసారి ఏ కూటమి వైపు మొగ్గుచూపుతారోననే అంశం ఉత్కంఠగా మారింది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కే మళ్లీ జైకొట్టి చరిత్ర లిఖిస్తారా? లేదంటే యూడీఎఫ్‌కు ఈసారి అవకాశం ఇస్తారో చూడాలి. 

ఇకపోతే, కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తంగా 10,04,197మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 4,72,650మంది పురుష ఓటర్లు కాగా, 5,31,431 మంది మహిళా ఓటర్లు. 116 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

బెంగాల్‌లో భారీగా బలగాల మోహరింపు

బెంగాల్‌లో మూడో దశ ఎన్నికలు 31 స్థానాల్లో జరగనున్నాయి.  ఆయా స్థానాల్లో 205మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 618 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. ఎన్నికల కోసం అధికారులు 10,871 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో దశ ఎన్నికల్లో 78.5లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోనే 16 నియోజకవర్గాలు ఉండగా.. హుగ్లీలో ఎనిమిది, హావ్‌డాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2016లో 31 స్థానాల్లో 30 స్థానాలు టీఎంసీ గెలుచుకోగా.. హావ్‌డాలోని అమ్టా నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌ గెలిచింది. 

అస్సాంలో ఆఖరి పోరు

అస్సాంలో ఆఖరి దశ ఎన్నికలు రేపు జరగనున్నాయి. మూడో దశలో ఇక్కడ 40 స్థానాలకు  ఎన్నికలు జరుగుతుండగా.. 337మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 25మంది మహిళలే. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా.. 2,33,74,087మంది ఓటర్లు ఉన్నారు. మూడో దశలో 79,19,641 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 40,11,539మంది పురుష ఓటర్లు కాగా.. 39,07,963 మహిళలు, 139మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts