Congress: అందుకోసమే కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగా: ఖర్గే

కాంగ్రెస్‌(Congress) పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి కాదని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే(Mallikargjun Kharge) స్పష్టంచేశారు.......

Published : 02 Oct 2022 16:17 IST

దిల్లీ: కాంగ్రెస్‌(Congress) పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి కాదని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి మల్లికార్జున ఖర్గే(Mallikargjun Kharge) స్పష్టంచేశారు. అనేకమంది సీనియర్లు, యువ నేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారన్నారు. ‘ఒకే వ్యక్తికి ఒకే పదవి’ సిద్ధాంతాన్ని అనుసరించి నామినేషన్‌ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్‌ నేతలు దీపేందర్‌ హుడా, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, గౌరవ్‌ వల్లభ్‌లతో కలిసి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నాయని.. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భాజపా ఇచ్చిన హామీలేవీ అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు.

మల్లికార్జున ఖర్గే అధ్యక్ష కొనసాగింపు, యథాతథస్థితికి అభ్యర్థి అయితే.. తాను మాత్రం మార్పు కోసమే పోటీ చేస్తున్నట్టు శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపైనా ఖర్గే స్పందించారు. ఎన్నికల తర్వాత సంస్కరణలపై తీసుకొనే ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుంటామని.. ఒక వ్యక్తిగా తీసుకోరన్నారు. ఖర్గే వెనుక గాంధీ కుటుంబం ఉందంటూ వస్తోన్న వార్తలను తోసిపుచ్చిన ఖర్గే.. అనేకమంది ఇతర నేతలు తనను పోటీ చేయాలని కోరారన్నారు. అనంతరం గౌరవ్‌ వల్లభ్‌ మాట్లాడుతూ.. దీపేందర్‌ హుడా, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌లతో పాటు తాను కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులుగా రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే తరఫున తాము ప్రచారం చేస్తామన్నారు.

మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే, శశిథరూర్‌ మధ్యే పోటీ నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8 వరకు గడువు ఉంది. అప్పటిలోగా ఉపసంహరణలేమీ లేకపోతే ఈ నెల 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజ ఫలితం ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో దాదాపు 9వేల మందికి పైగా  ప్రతినిధులు తమ ఓటుద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని