Telangana News: రేవంత్‌.. సీఎం కేసీఆర్‌ మీలా లాలూచీ పనులు చేయలేదు: ఎర్రబెల్లి దయాకర్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Updated : 22 Apr 2022 17:05 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు గెలిచిందని.. ఇప్పుడు కాంగ్రెస్ జీరో అయిందన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది ఒక్క రేవంత్‌ రెడ్డి మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు ఒక్కరైనా.. రేవంత్ మంచోడని చెప్పమనండి అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘‘తెలంగాణ ఉద్యమాన్ని సీఎం కేసీఆర్‌ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లారు. రేవంత్‌లా ఎక్కడా ఎలాంటి లాలూచీ పనులు కేసీఆర్‌ చేయలేదు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం పోరాడితే.. రేవంత్‌ మాత్రం చంద్రబాబు దగ్గర కూర్చున్నారు. చెప్పాలంటే రేవంత్‌.. చంద్రబాబుకు ఏజెంట్‌గా పని చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి.. మీరు మీ భాష మార్చుకోవాలి. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ ఓడిపోతుంది. కేసీఆర్‌.. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానేత. మిషన్‌ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌ది. ఒకప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు చేసేవారు. ఈ ఏడేళ్లలో ఎక్కడైనా నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు జరిగాయా? కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇక్కడి పథకాలు అమలువుతున్నాయా?రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చి కేసీఆర్‌ రైతులను ఆదుకుంటున్నారు. రైతుల కోసం సభ పెడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లే అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంటే.. కేంద్రంపై పోరాటం చేయకుండా విజిలెన్స్‌, సీబీఐ అని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. బియ్యం కొంటామని చెప్పి కేంద్రం మోసం చేస్తే కేసీఆర్‌ ముందుకొచ్చి కొంటున్నారు. రైతుల కోసం రూ.3, 4 వేల కోట్లు నష్టాన్ని కూడా కేసీఆర్‌ లెక్క చేయడం లేదు. తీరా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనేందుకు సిద్ధపడితే అవినీతి చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతూ.. పూర్తిగా దిగజారి మాట్లాడుతున్న విపక్ష నేతల తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలి’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని