Etela Rajender: పేపర్‌ లీకేజీ.. కావాలని చేశారా? యాదృచ్ఛికమా?: ఈటల రాజేందర్‌

పేపర్‌ లీకేజీ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 18 Mar 2023 14:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయంటే భారాస (BRS) ప్రభుత్వ పనితనం ఏవిధంగా ఉందో అర్థమవుతోందని భాజపా (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela Rajender) విమర్శించారు. ఇది కావాలని చేశారా? లేదా యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఛైర్మన్‌, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించడం లేదన్న ఈటల.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈటల రాజేందర్‌ కోరారు. రద్దయిన పరీక్షలను వెంటనే నిర్వహించాలన్నారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి అప్పులు చేసి చదువుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వారు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. యువత తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై రాష్ట్ర భాజపా నేతలు గవర్నర్‌ తమిళి సైను కలిసి ఫిర్యాదు చేశారు. పేపర్‌ లీకేజీపై భారాస సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ను కలిసి వారిలో బూర నర్సయ్య గౌడ్‌, ఈటల రాజేందర్, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, రాంచంద్రరావు, విఠల్‌ తదితరులు ఉన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని