Revanth Reddy: ఇది నా అనుభవానికి మించిన బాధ్యత

తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎంపీ రేవంత్‌రెడ్డి వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపింది. అయితే ఆయన నాయకత్వంలోని కొత్త కార్యవర్గం సవాళ్లపై నడక సాగించాల్సి ఉంది....

Updated : 03 Jul 2021 19:22 IST

కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోతోంది

సమాజంలో చీలికలు తెచ్చే భాజపాకు ప్రజలు ఓట్లు వేయరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్ష నియామకంపై సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎంపీ రేవంత్‌రెడ్డి వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపింది. అయితే ఆయన నాయకత్వంలోని కొత్త కార్యవర్గం సవాళ్లపై నడక సాగించాల్సి ఉంది. వరుస ఓటములతో పాటు పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడటం వంటి సమస్యలతో కాంగ్రెస్‌ రాష్ట్ర కేడర్‌ సతమతమవుతోంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి, నూతన అధ్యక్షుడిగా ఆయన ముందున్న సవాళ్లు, పార్టీ సీనియర్‌ నేతలను కలగలుపుకొని ఎలా ముందుకు సాగనున్నారనే తదితర అంశాలపై రేవంత్‌రెడ్డితో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. కాగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ నూతన కార్యవర్గం.. రాబోయే ఎన్నికల సన్నాహక కమిటీగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి తన అనుభవానికి మించిన బాధ్యతగా పేర్కొన్నారు. పార్టీలో సమష్టి నిర్ణయాలతోనే ముందుకు సాగనున్నట్లు తెలిపారు. పీసీసీ నియామకం వరకే పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. అధిష్ఠానం ప్రకటన అనంతరం అందరూ సహకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛలేకుండా కేసీఆర్‌ నిర్బంధించారని, విముక్తి కోసం కాంగ్రెస్  శ్రేణులను సిద్ధంచేస్తున్నట్టు తెలిపారు.

పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని మీకు ముందే ఏమైనా సంకేతాలు వచ్చాయా?

నాకు ఎలాంటి సమాచారం లేదు. దిల్లీలో కొన్ని కార్యక్రమాలు, న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కమిటీ మీటింగులు ఉంటేనే అక్కడికి వెళ్లాను. ఆ కార్యక్రమాలు ముగించుకొని వెనక్కి వచ్చిన తర్వాత ఇంఛార్జి జనరల్ సెక్రెటరీ ఆర్డర్‌ రిలీజ్‌ చేశారు. 170 మందితో నాలుగు రోజులపాటు గాంధీభవన్‌లో చర్చించి.. ప్రతిఒక్కరి అభిప్రాయాన్ని సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మీకే ఈ పదవి దక్కడానికి కారణాలు చెప్పగలరా?

కాంగ్రెస్‌ పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఎక్కువ. 1984-85 సమయంలో ఎన్టీఆర్‌ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో.. కాంగ్రెస్‌ను బలంగా నడిపించేందుకు అత్యంత పిన్న వయసు కలిగిన 34 ఏళ్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. పార్టీలో ఉద్ధండులు ఉన్నప్పటికీ ఓ యువకుడిని అధ్యక్షుడిగా నియమించింది. తరువాత కూడా పార్టీలో సీనియర్లు ఉన్నప్పటికీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. సమయం, సందర్భాన్ని బట్టి పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి.. ఎన్నికలు, పార్టీ నిర్వహణ, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధిష్ఠానం తన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇదో గురుతర బాధ్యత. నా అనుభవానికి మించిన బాధ్యత.

వరుస ఓటములతో కాంగ్రెస్‌ డీలా పడిపోయింది. చాలా మంది నాయకులు పార్టీని వీడిపోయారు. ఉన్న కార్యకర్తలకు అండగా ఉండే నాయకత్వం లేక వారు కూడా నిశ్చేష్టులయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందున్న లక్ష్యాలేంటి? ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళతారు?

30 సంవత్సరాలుగా రాజకీయ పరిణామాలను గమనిస్తే.. 1994-2004 వరకు తెదేపా అధికారంలో ఉంది. 1994లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 1999లో కూడా 90 సీట్లకే పరిమితమైంది. ఆ ఓటములతో కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని అంతా అన్నారు. కానీ 2004లో పొత్తులతో కలిపి దాదాపు 250 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2004-14 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఒక సందర్భంలో సరైన ఫలితాలు తెచ్చుకోలేకపోతే ఆ పార్టీ పనైపోయింది అనుకోవడం భ్రమే. ఒక్కో పార్టీకి ప్రజలు పదేళ్ల సమయం ఇచ్చారు. 2014-24 వరకే తెరాస అధికారంలో ఉంటుంది. ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది. తెలంగాణ సాధించేందుకు కేసీఆర్‌ చేసిన శ్రమ కంటే, ప్రజలు చాలా ఎక్కువ ఇచ్చారు. జీవిత కాలానికి సరిపడేంత ఇచ్చారు. ప్రజలను కేసీఆర్‌ స్వేచ్ఛ లేకుండా నిర్బంధించారు. తెలంగాణ సమాజం ఆయన నుంచి విముక్తి కోరుకుంటోంది. కేసీఆర్‌ చేతిలో బందీ అయిన రాష్ట్రాన్ని విముక్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. ఇక్కడ తెరాసకు మేమే ప్రత్యామ్నాయం. 

ఏఐసీసీ ప్రకటన విడుదల చేసిన మరుక్షణం నుంచే మీరు వరుసగా సీనియర్‌ నేతలను కలుస్తున్నారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారు?

ప్రకటన రాకముందు ఏ సీనియర్లైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారో.. ఆ సీనియర్లే ఇప్పుడు నాకు మద్దతు తెలిపి, కార్యాచరణ తీసుకునేందుకు సహకరించారు. ఆసుపత్రి ఐసీయూలో ఉన్న హనుమంతరావును పలకరించేందకు వెళ్లినప్పుడు ఆయన తన అనారోగ్యం గురించి చర్చించకుండా తెలంగాణలో దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. పీసీసీ అధ్యక్ష నియామకంపై ఎన్ని భిన్నాభిప్రాయాలు వచ్చినా.. ప్రకటన విడుదల తర్వాత ప్రతిఒక్కరు సహకరించేందుకు ముందుకొస్తున్నారు. కుటుంబ పెద్దగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించమే పార్టీ సభ్యుల బాధ్యత. అందరి అభిప్రాయాలను తీసుకొని సమష్టి నిర్ణయాలతో ముందుకెళతా.

ఇప్పటికీ కొంతమంది సీనియర్‌ నేతలు మిమ్మల్ని కలిసేందుకు ఇష్టపడటం లేదని, మీరు అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వడంలేదని తెలుస్తోంది. వాళ్ల విషయంలో మీరు ఎలా వ్యవహరించనున్నారు?

అవన్నీ మీ అపోహలు. ముందస్తు నిర్ణయించుకున్న కార్యక్రమాలతో కొందరిని కలిసేందుకు సమయం పట్టొచ్చు. నేను బాధ్యతలు తీసుకునే 7వ తేదీ లోపు ప్రజలకున్న అనుమానాలు, అపోహలకు సమాధానం లభిస్తుంది.

మేం బలంగా ఉన్నామని, కాంగ్రెస్‌ మాకు దీటుగా రాలేదని  రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తెరాస, కేంద్రంలోని భాజపా పేర్కొంటున్నాయి. కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా పలు పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీని ఎలా చక్కబెడతారు?

ఒకసారి అధికారంలోకి వస్తే ఆ అధికారం వారికి శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకొని, నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకెళతాం. భాజపా, తెరాస పార్టీలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ పార్టీల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్రంలో భాజపా అసలు ప్రత్యామ్నాయమే కాదు. సమాజంలో చీలికలు తెచ్చే భాజపాకు ప్రజలు ఓట్లు వేస్తారని నేను భావించడంలేదు. ఎంపీలు పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడుతుంటే.. ఆ సమయంలో కేసీఆర్‌ బయట విహార యాత్రలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన అనంతరం మేమే తీసుకొచ్చామని కేసీఆర్‌ ఊరేగారు. ప్రజలను మభ్యపెట్టారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తారనే వార్తలు వస్తున్నాయి? అందులో నిజమెంత?

పార్టీలో అందరితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం. 7వ తేదీన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏ నిర్ణయమైనా వెల్లడిస్తాం.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొద్దిరోజులుగా జల వివాదం చెలరేగుతోంది. ఉన్నపలంగా ఎందుకు ఇది తెరపైకి వచ్చింది?

కేసీఆర్‌ ప్రధాన కాంక్ష నీళ్లు, నిధులు, నియామకాలు. ఇదే తెరాస ఎజెండా. కానీ కేసీఆర్‌ నీళ్లలోనే నిధులను చూస్తున్నారు. నిధులు కావాల్సిన ప్రతిసారి నీటి ప్రాజెక్టుల టెండర్లు పిలిచి నిధులు సంపాదిస్తున్నారు. నీరు కేసీఆర్‌కు ఆదాయ వనరు. ఓట్లు కావాలన్నా.. నిధులు కావాలన్నా ఆయనకు నీళ్లే పెద్దదిక్కు. కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. ఇందుకే ప్రజల్లో ఓ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. 

2023లో ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్‌ ఎలా ఉండబోనుంది. అధ్యక్షుడిగా పార్టీని ఎలా నడిపించనున్నారు?

కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా చెప్పలేం. 2022 చివరి నాటికే ఎన్నికలు ఉంటాయేమోనని భావిస్తున్నా. కాబట్టి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయనున్నాం. ఇందుకోసం పార్టీ విధివిధానాలు, వర్గీకరణ, కమ్యూనికేషన్‌తోపాటు వీటిని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతాం. తెలంగాణ తల్లికి పర్యాయపదం సోనియాగాంధీ.. ఆమె పేరుతోనే ప్రజల వద్దకు వెళ్తాం. సోనియాగాంధే మా గెలుపునకు పునాది. ఆమె నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని