Biplab Kumar: ఆయన అసమర్థతతో భాజపా పెద్దలూ విసిగిపోయారు: టీఎంసీ

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ శనివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది సేపటికే.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన అసమర్థత పట్ల భాజపా పెద్దలూ...

Published : 15 May 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ శనివారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది సేపటికే.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన అసమర్థత పట్ల భాజపా పెద్దలూ విసిగిపోయారని ఎద్దేవా చేసింది. ‘గుడ్‌ బై సీఎం. త్రిపురవాసులకు విముక్తి లభించింది. ఇప్పటికే జరిగిన నష్టం చాలు. ఎంతలా అంటే.. భాజపా అధిష్ఠాన నేతలూ ఆయన అసమర్థతతో విసిగిపోయారు. రాష్ట్రంలో టీఎంసీ సాధించిన పురోగతి చూసి భాజపా నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఏదేమైనా.. మార్పు అనివార్యం’ అని ట్వీట్‌ చేసింది. ముఖ్యమంత్రిని మార్చడం వల్ల అవినీతి, అసమర్థ, విభజనవాద రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తొలగిపోదని విమర్శించింది. త్రిపురలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. కొంతకాలంగా బెంగాలీ మెజారిటీ రాష్ట్రమైన త్రిపుర రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. మమతా మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఈ రాష్ట్రంలో తరచూ పర్యటిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరుపక్షాల కార్యకర్తల మధ్య తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. త్రిపుర వ్యవహారాల్లో టీఎంసీ ప్రభావమేమీ ఉండబోదని భాజపా కొట్టిపారేసింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రాజీనామా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని