Kejriwal: నా భార్య కూడా నన్నంతలా తిట్టదు.. ఎల్జీ సాబ్‌‌ చిల్‌ అవ్వండి!

దిల్లీ ప్రభుత్వం చేపడుతున్న పథకాల విషయంలో సీఎం ఆప్‌‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మధ్య గత కొంత కాలంగా తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సీఎం కేజ్రీవాల్‌ ఎల్జీ వీకే సక్సేనాపై సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు.

Published : 07 Oct 2022 01:35 IST

కేజ్రీవాల్‌ సెటైరికల్‌ ట్వీట్‌ వైరల్‌

దిల్లీ: దిల్లీ ప్రభుత్వం చేపడుతున్న పథకాల విషయంలో సీఎం ఆప్‌‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మధ్య గత కొంత కాలంగా  మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సీఎం కేజ్రీవాల్‌ ఎల్జీ వీకే సక్సేనాపై సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఎల్జీ సాబ్‌ నన్ను రోజూ తిట్టినంతగా నా భార్య కూడా తిట్టదు. గత ఆరు నెలలుగా ఎల్జీ సాబ్‌ రాసినన్ని ప్రేమలేఖలు నా భార్య కూడా రాయలేదు. ఎల్జీ సాబ్‌ మీరు చిల్‌ అవ్వండి.. మీ సూపర్‌ బాస్‌ని కూడా కొంచెం చిల్‌ చేయండి’’ అని పేర్కొంటూ కేజ్రీవాల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మరోవైపు, దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంపై మూడు నెలల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించడం.. ఫలితంగా సిసోడియా ఇంట్లో సోదాలతో పాటు దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న ఉచిత విద్యుత్‌ పథకంపైనా తాజాగా విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు ఆప్‌, ఎల్జీ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణకు ఆదేశించడంతో పాటు కేజ్రీవాల్‌ సర్కార్‌ ఇచ్చిన విద్యుత్‌ సబ్సిడీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ను ఎల్జీ ఆదేశించారు. ఏడు రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే, ఎల్జీ తీసుకున్న నిర్ణయంపై ఇటీవల స్పందించిన కేజ్రీవాల్‌.. ఆప్‌ ఉచిత విద్యుత్‌ హామీ గుజరాత్‌ ప్రజలు ఇష్టపడుతున్నారని.. అందుకే దిల్లీలో ఉచిత విద్యుత్‌ పథకాన్ని నిలిపేయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ పథకాన్ని ఆగనివ్వనని.. దిల్లీ ప్రజలంతా తనను నమ్మాలన్నారు. గుజరాత్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వచ్చే ఏడాది మార్చి నుంచి ఉచిత విద్యుత్‌ అందిస్తామంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని