CM KCR: కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. రైతుల సమస్యలపై గిరిధర్‌ గమాంగ్‌ అనేక పోరాటాలు చేశారని, దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్‌ ఒకరని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 27 Jan 2023 20:42 IST

హైదరాబాద్‌: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిధర్‌ గమాంగ్‌తో పాటు పలువురు నేతలకు సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి భారాసలోకి ఆహ్వానించారు. ఒడిశా మాజీ మంత్రి శివరాజ్‌ పాంగితో పాటు ఇతర నాయకులు హేమ గమాంగ, జయరామ్‌ పాంగి, రామచంద్ర హన్సద, బృందాబన్‌ మాఝి, నబిన్‌ నందా, రతా దాస్‌, భగీరథ్‌ శెట్టి, మయాధర్‌ జేనా తదితరులు భారాసలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై గిరిధర్‌ గమాంగ్‌ అనేక పోరాటాలు చేశారని, దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్‌ ఒకరని వెల్లడించారు. ‘‘ప్రపంచ దేశాల్లో కంటే భారత్‌లో ఎక్కువ వనరులు ఉన్నాయి. అమెరికా, చైనా, అభివృద్ధి చెందిన దేశాలకంటే వనరులు ఎక్కువ ఉన్నాయి. కానీ, దేశ యువత అమెరికా వెళ్లేందుకు తహతహలాడుతున్నారు. భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటోంది. ఇప్పటికీ భారత్‌లో రైతులకు సాగునీరు, విద్యుత్‌ అందని పరిస్థితి. ప్రభుత్వాలు మారినా రైతులు, కార్మికుల పరిస్థితులు మారలేదు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. భారాస ఆ మార్పు తెస్తుంది..

‘‘దౌర్జన్యంతో ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా మారింది. ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే సమాజసేవ లక్ష్యంగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు కానీ ప్రజలు ఓడుతున్నారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు కాదు ప్రజలు గెలవాలి. ఎన్నికల్లో ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా భారాస మార్పు తెస్తుంది. భారత్‌లో పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉంది. పరివర్తన సమయంలో చాలా మంది ఇష్టారీతిన విమర్శలు చేస్తారు. మహారాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకున్న రాష్ట్రం. మహారాష్ట్ర కంటే తెలంగాణ బలహీనమైనది. గతంలో తెలంగాణ నుంచి ఉపాధి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లే వారు. ఇప్పుడు వలస వెళ్లిన ప్రజలు వెనక్కి వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు కాదు. ఆర్థిక సమస్యలు కాదు.. చిత్తశుద్ధి లోపం వల్ల సమస్యలు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. భారత్‌ ఎలాంటి లక్ష్యం లేకుండా ముందుకెళ్తోంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని