Gujarat Election 2022: ఎన్నికల ముందు భాజపాకు మాజీ మంత్రి షాక్‌..!

గుజరాత్‌లో మాజీ మంత్రి ఒకరు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Updated : 05 Nov 2022 16:06 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఎన్నికల ముందు అధికార భారతీయ జనతా పార్టీకి మాజీ మంత్రి ఒకరు షాకిచ్చారు. మాజీ మంత్రి జయనారాయణ్‌ వ్యాస్‌ శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

వ్యాస్‌.. శనివారం తన రాజీనామా లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌కు పంపించారు. ‘‘గత మూడు దశాబ్దాలుగా భాజపా సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీకి నేను సేవ చేశాను. ఈ రోజు వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అని వ్యాస్‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్‌ ఇటీవల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, కాంగ్రెస్‌ గుజరాత్‌ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. అయితే వ్యాస్‌ తన భవిష్యత్‌ కార్యాచరణపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్‌ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్‌.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యాస్‌ రాజీనామాపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ స్పందిస్తూ.. ‘‘గతంలో ఓడిపోయినప్పటికీ ఆయనకు పార్టీ పలుమార్లు టికెట్‌ ఇచ్చింది. ఈ సారి మాత్రం 75ఏళ్లు పైబడిన వారికి పార్టీ టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయించింద’’ని తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని