Bandaru Satyanarayana: సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ.. పెద్ద స్కామ్‌: బండారు సత్యనారాయణ

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల భూములకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. సీఎం జగన్ భూ దోపిడీకి తెర లెపారని వ్యాఖ్యానించారు. ‘మీ భూమి - మా హామీ’కి బదులు ‘మీ భూమి - నా భూమి’ అని పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.

Published : 23 Nov 2022 15:22 IST

విశాఖ: జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల భూములకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. సీఎం జగన్ భూ దోపిడీకి తెర లేపారని వ్యాఖ్యానించారు. ‘మీ భూమి - మా హామీ’కి బదులు ‘మీ భూమి - నా భూమి’ అని పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే వాలంటీర్ సంతకం పెట్టాలనడం  దారుణమన్నారు. సర్వే అండ్ సెటిల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ పేరు పలకడం కూడా సీఎం జగన్‌కు చేతకాలేదన్నారు. రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసుకున్న ఖర్మ కొద్దీ జగన్ సీఎం అయ్యారని.. శ్రీకాకుళం నుంచి అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.

‘‘స్పందనలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులు ఎందుకు పరిష్కారం కావట్లేదు? 90 శాతం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పడం అబద్ధమే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదా?  ముదపాక ల్యాండ్ పూలింగ్‌లో తప్పుందని నాపై ఆరోపణలు చేశారు. నిరూపిస్తే నా తల నరుక్కుంటాను.  నా పాస్ బుక్‌పై ఓ అవినీతిపరుడి బొమ్మా.. ఆయనేమైనా మాకు భూమి ఇచ్చారా? ఆయన బొమ్మతో నా భూమిలో సర్వే రాయి పెట్టడం ఏంటి? పాస్ బుక్, సర్వే రాళ్లపై బొమ్మలు తీయించకపోతే కోర్టుకు వెళ్తాను. వందేళ్ల సమస్యలు కాదు.. ముందు నీ హయాంలో నెలకొన్న మూడేళ్ల సమస్యలు పరిష్కరించు. దొంగ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. సర్వే రాళ్లపై బొమ్మలనేది ఓ పెద్ద స్కామ్’’ అని సత్యనారాయణ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని