Revanthreddy: కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్‌ రాబోతోంది: రేవంత్‌రెడ్డి

పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో

Published : 24 Jun 2022 17:48 IST

హైదరాబాద్‌: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్నవారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 11 నెలల్లో ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 10 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందన్నారు. 

‘‘హరితహారం పేరుతో దాడులు చేస్తున్నారు. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్‌లు వేస్తున్నారు.  తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్‌ మరింత బలపడుతుంది. రైతు డిక్లరేషన్‌ అమలైతే .. రైతుల జీవితాలే మారిపోతాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవాలి... పేదల ప్రభుత్వం రావాలి. త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. త్వరలో కాంగ్రెస్‌లో చేరికల తుపాన్‌ రాబోతోంది’’ అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. కొత్త రేషన్‌ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తే సరిపోతుందా? ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జా, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని