Exit polls2022: గుజరాత్‌లో మళ్లీ కమలదరహాసమే.. హిమాచల్‌లో హోరాహోరీ!

దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల((Assembly election 2022) సమరం నేటితో ముగిసింది. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు ఒకే దశలో గత నెలలోనే పూర్తి కాగా.. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్‌ నేటితో ముగిసింది.

Updated : 05 Dec 2022 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly election 2022) సమరం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి పలు ప్రఖ్యాత సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల స్వరాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన  ఉత్కంఠ పోరులో మళ్లీ కమలమే వికసించబోతున్నట్టు అన్ని సర్వేలూ ముక్తకంఠంతో చెప్పాయి. అక్కడ ప్రధానంగా  మోదీ ఛరిష్మానే పనిచేసి మరోసారి రికార్డుస్థాయిలో కమలనాథులు గెలవబోతున్నట్టు పేర్కొంటున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం భాజపా-కాంగ్రెస్‌ మధ్య ఫలితం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని పలు సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్‌ కేవలం ఒక అంకె స్థానాలకే పరిమితం కానున్నట్టు పేర్కొంటున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌లలో ఎవరు అధికారం చేపట్టే అవకాశం ఉందనే అంశంపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలేం చెబుతున్నాయో చూద్దాం..

గుజరాత్‌లో మళ్లీ కమలదరహాసమే..

గుజరాత్‌లో మళ్లీ భాజపాకే అధికారం దక్కుతుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. మోదీ జనాకర్షణతో భాజపాకు దాదాపు 100కు పైగా స్థానాలు వస్తాయని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్లు చీలికతో భాజపాకు భారీ లాభం చేకూరినట్టు సర్వేలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌, ఆప్‌, ఇతర పార్టీల ఓట్ల చీలికతో అధికార పార్టీకి లబ్ధి చేకూరినట్టు తెలిపాయి.

హిమాచల్‌లో హోరా హోరీ

హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ ఉంటుందని పేర్కొంటున్నాయి. రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్యూ, న్యూస్‌ ఎక్స్‌ , ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌, టైమ్స్‌ నౌ-ఈటీజీ సర్వేల్లో భాజపాకు ఆధిక్యం చూపిస్తుండగా.. పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో కాంగ్రెస్‌కు ఆధిక్యం చూపిస్తోంది.

అసలు లెక్క తేలేది 8న

ఈసారి గుజరాత్‌లో రికార్డుస్థాయిలో ఓట్లు, సీట్లతో సాధించాలని, హిమాచల్‌లో అధికార మార్పిడి ట్రెండ్‌కు ముగింపు పలకాలన్న పట్టుదలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటు ఆ పార్టీ అగ్రనేతలంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. మరోవైపు, తమ పూర్వ వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేశ్ వంటి కొందరు సీనియర్‌ నేతలు ప్రచారం పర్వంలో చెమటోడ్చారు. భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నందున రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల ప్రచారానికి (గుజరాత్‌లో ఒకట్రెండు సభల్లో తప్ప) దూరంగానే ఉన్నారు. ఇకపోతే, ఆప్‌ కూడా ఈ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసింది. ఈ నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య హోరాహోరీగా కొనసాగిన ఈ ఉత్కంఠ పోరులో గెలుపెవరదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు నవంబర్‌ 12న ఒకే దశలో పూర్తి కాగా 66.58శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే, గుజరాత్‌లో మొత్తం 182 సీట్లకు గాను రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్‌ 1న 89 స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో 63.31శాతం పోలింగ్‌ నమోదవ్వగా.. డిసెంబర్‌ 5న 93 సీట్లకు రెండో దశలో సాయంత్రం 5గంటల వరకు 58 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. సర్వేల అంచానా ఎలా ఉన్నప్పటికీ అసలు లెక్కలు తేలాలంటే డిసెంబర్‌ 8న వెల్లడయ్యే ఫలితాలు వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని