Exit Polls: పంజాబ్‌ను ఊడ్చేయనున్న ఆమ్‌ఆద్మీపార్టీ..?

దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ త్వరలోనే పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు సిద్ధమైనట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడిస్తున్నాయి.

Published : 08 Mar 2022 01:18 IST

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ చీపురు వైపే మొగ్గు

దిల్లీ: ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ పార్టీల అధికారంలో ఉండిపోయిన పంజాబ్‌ ముఖచిత్రం ఈసారి పూర్తిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో దేశం దృష్టిని ఆకర్షించిన పంజాబ్‌.. తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ త్వరలోనే పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు సిద్ధమైనట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, అకాలీదళ్‌ వంటి దిగ్గజ పార్టీలను మట్టికరిపించి ఒంటి చేత్తోనే అధికారంలోకి రానున్నట్లు ముందస్తు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న ఆమ్‌ఆద్మీ.. పెద్ద రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడం గమనార్హం.

ఈటీజీ రీసెర్చ్‌ అంచనాల ప్రకారం, పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గానూ 70 నుంచి 75 సీట్లలో ఆప్‌ గెలువనుందని పేర్కొంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ పంజాబ్‌లో 76 నుంచి 90 సీట్లు సొంతం చేసుకోనున్నట్లు ఇండియా టుడే లెక్కగట్టింది. ఇక న్యూస్‌ఎక్స్‌-పోల్‌స్ట్రాట్‌ ప్రకారం ఆమ్‌ఆద్మీకి 56 నుంచి 61 వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. రిపబ్లిక్‌ టీవీ కూడా కేజ్రీవాల్‌ పార్టీ 62 నుంచి 70 సీట్లలో విజయం సాధించనున్నట్లు అంచనా వేసింది. ఇలా అన్ని సర్వేలూ ఆమ్‌ఆద్మీవైపే మొగ్గు చూపాయి.

దిల్లీ మంత్రం పనిచేస్తున్నట్లేనా..?

పార్టీ స్థాపించిన అనతికాలంలోనే దేశ రాజధానిలో పాగావేసిన ఆమ్‌ఆద్మీ, సరిహద్దు రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి 12 స్థానాలు కైవసం చేసుకుంది. వీలైనప్పుడల్లా దిల్లీ ప్రభుత్వ మోడల్‌ను వివరిస్తూ పంజాబ్‌ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. వీటితోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మన్‌ను ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూనే మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలకు చెక్‌ పెడుతూ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ముందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

వర్గపోరుతో కాంగ్రెస్‌ కుదేలు..!

గతకొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి పంజాబ్‌లోనూ పరాభవం తప్పనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ పదవికి రాజీనామా చేయడం మొదలు.. కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, నవజోత్‌సింగ్‌ సిద్ధూ మధ్య చోటుచేసుకున్న అంతర్గత పోరు వరకూ కాంగ్రెస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమరీందర్‌ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ఎక్కువైంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నవజోత్‌సింగ్‌ సిద్ధూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని తేల్చడంలోనూ కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసిన తాత్సారం మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిన కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం.. సరైన విధంగా స్పందించకపోవడంతో కీలకంగా ఉన్న పంజాబ్‌ నుంచి కాంగ్రెస్‌ నిష్ర్కమించక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అల్లుడి అరెస్టుతో..

కాంగ్రెస్‌ పార్టీ కీలకంగా భావిస్తోన్న పంజాబ్‌లో.. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చరణ్‌జిత్‌ చన్నీకి ఆది నుంచి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇసుక అక్రమ మైనింగ్‌ ఆయనను వెంటాడిందనే చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో సీఎం అల్లుడు భూపేందర్‌ సింగ్‌హనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు నిర్వహించింది. చివరకు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో అధికార కాంగ్రెస్‌ అకాలీదళ్‌, ఆమ్‌ఆద్మీతోపాటు భాజపా పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇవి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

భాజపాపై రైతన్నల ఆగ్రహం..?

పంజాబ్‌లో ఊహించినట్లుగా భాజపాను పంజాబ్‌ ఓటర్లు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాది అన్నదాతల చేపట్టిన ఉద్యమం యావత్‌ దేశాన్ని కదిలించింది. చివరకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భాజపాను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టిన అమరీందర్‌ సింగ్‌ భాజపాకు మద్దతు ఇచ్చినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేకపోయినట్లు కనిపిస్తోంది. ఇక అకాలీదళ్‌ కూడా ఈసారి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లను సాధించలేకపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ 10 నుంచి 14 సీట్లలో గెలిచే అవకాశాలే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని