TG Congress: కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్‌ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది.

Published : 11 Jul 2024 04:08 IST

కారణాలపై నేటి నుంచి కురియన్‌ కమిటీ ఆరా...
గాంధీభవన్‌లో మూడు రోజులు నేతలతో భేటీ

కమిటీ సభ్యులకు స్వాగతం పలికిన పార్టీ నేతలు. చిత్రంలో పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, 

ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, కురియన్, రకీబుల్‌ హుస్సేన్, పీసీసీ నేత ఫహీం

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్‌ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ బుధవారం హైదరాబాద్‌ చేరుకుంది. కురియన్‌తో పాటు రకీబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. కమిటీ గురువారం నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటుంది. గాంధీభవన్‌లో తొలి రోజైన గురువారం పార్టీ ఎంపీలు, లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమై జయాపజయాలకు కారణాలపై వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ప్రధానంగా కాంగ్రెస్‌ గెలుస్తుందనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై వారిని కమిటీ సభ్యులు ఆరా తీస్తారు. రెండో రోజు (శుక్రవారం) పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. మూడో రోజు (శనివారం) జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళతారా.. లేదా.. శనివారంతోనే రాష్ట్ర పర్యటన ముగిస్తారా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ముఖ్య నాయకుడొకరు ‘ఈనాడు’కు తెలిపారు. ప్రధానంగా చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్‌ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులేమిటనే కోణంలో అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ జరుపుతుందని సమాచారం. ఆయా స్థానాల నేతలు తగు సమాచారంతో హాజరుకావాలని ఇప్పటికే వారికి పార్టీ సూచించింది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక నేతలు సరిగా పనిచేయలేదనే ఆరోపణలు సైతం ఉన్నందున వారి గురించి వివరాలు సేకరించనుంది. నేతల పనితీరు, పోల్‌ మేనేజ్‌మెంట్‌కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ సమాచారం అడగనుందని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని