Maharashtra: సీఎంగా ఫడణవీస్‌.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అయితే ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఉంటారా?

Updated : 30 Jun 2022 11:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర (Maharahstra) ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అయితే ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ప్రభుత్వంలో ఉంటారా? ఆయనకు ఏ పదవికి దక్కనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌  (Devendra Fadnavis) నేతృత్వంలోనే కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రేపే ఆయన ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం.

నేడు భాజపా కీలక సమావేశం..

ఠాక్రే వైదొలగడంతో మహారాష్ట్రలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. శిందే (Eknath Shinde) వర్గం మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా గవర్నర్‌ను సంప్రదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు భాజపా కోర్‌ కమిటీ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ఠాక్రే రాజీనామా చేసిన కొద్ది గంటల తర్వాత శిందే.. దేవేంద్ర ఫడణవీస్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రెబల్స్‌ మద్దతుతో భాజపా ఏర్పాటు ఖాయంగానే కన్పిస్తోంది. తమకు 170 మంది సభ్యుల మద్దతు ఉందని భాజపా చెబుతోంది.

 రేపే ప్రమాణ స్వీకారం?

ఈ మధ్యాహ్నం జరిగే సమావేశం తర్వాత భాజపా తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోసారి దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోనే కాషాయ పార్టీ సర్కారును ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శిందేకు ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మంత్రులకు మళ్లీ అవే శాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం భాజపా, శిందే వర్గం గవర్నర్‌ను కలిస్తే.. రేపు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెబల్స్‌లో మొత్తం 12 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశముంది.

శిందే ‘శాసనసభాపక్ష’ సమావేశం

శిందేతో కలిసి తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గోవా హోటల్‌లో ఉన్నారు. ఠాక్రే గద్దె దిగిన తర్వాత వీరంతా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు శిందే రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ‘శాసనసభా పక్ష’ సమావేశం నిర్వహించారు. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత అసలైన శివసేన వర్గం తమదేనని శిందే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాసనసభాపక్ష నేత హోదాలో నేడు ఆయన సమావేశం నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలంతా ముంబయి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని