Devendra Fadnavis: భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్‌

భాజపా, శివసేన.. రెండింటినీ తామెప్పుడూ వేర్వేరుగా భావించలేదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు...

Published : 03 Jul 2022 11:35 IST

ముంబయి: భాజపా, శివసేన.. రెండింటినీ తామెప్పుడూ వేర్వేరు పార్టీలుగా భావించలేదని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. మధ్యలో విడిపోయినప్పటికీ.. తిరిగి ఏకతాటిపైకి వచ్చామని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ముంబయిలోని హోటల్‌ తాజ్‌ ప్రెసిడెంట్‌లో శిందే వర్గ శివసేన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మాతో కలిసి వచ్చిన మీరంతా నిజమైన శివసైనికులు. బాలాసాహెబ్‌ నిజమైన సిద్ధాంతంతో తిరిగొచ్చారు. మహారాష్ట్రకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మనమంతా కలిసి పనేచేయాల్సి ఉంది’’ అని ఫడణవీస్‌ శిందే వర్గ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే సైతం ఈ సమావేశంలో ఉన్నారు. ఆయన కూడా ఈ భేటీలో మాట్లాడారు. ‘‘బాలాసాహెబ్‌ కలను సాకారం చేశాం. గత కొన్నేళ్లుగా జరిగిన పరిణామాలు శివసేన ప్రతిష్ఠను దిగజార్చాయి. ఉగ్రవాది దావూద్‌తో సంబంధాలున్న మంత్రులను కాపాడాల్సి వచ్చింది. సావర్కర్‌ను అవమానించడం శివసైనికులను ఇబ్బంది పెట్టింది. ఇలా చాలా అంశాలు బాధ కలిగించాయి. ఇవన్నీ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి’’ అని శిందే అన్నారు.

ఈ విషయాలన్నింటినీ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని శిందే తెలిపారు. కానీ, అవన్నీ వారికి అర్థం కాలేదన్నారు. దీంతో పరిస్థితులు ఇక్కడి వరకు వచ్చాయన్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫడణవీస్‌, భాజపా కేంద్ర నాయకత్వానికి శిందే ధన్యవాదాలు తెలిపారు. శివసైనికుడు సీఎంగా ఉండడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని