Updated : 17 Apr 2021 11:14 IST

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. వైకాపా దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్‌ కూడలి వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లపై ఏ మాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోగా తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్‌ ఎస్పీ కార్యాలయం ముందే ఓ ప్రైవేటు బస్సును ఆపిన తెదేపా నేతలు బస్సులో ఉన్న వ్యక్తులను ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

ఓ కల్యాణ మండపంలో బయటి వ్యక్తులు బస చేశారన్న నేపథ్యంలో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ బస చేసిన వ్యక్తులు జారుకున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. బస్సులు, కార్లు ఆపి నకిలీ ఓటర్లను తెదేపా, కాంగ్రెస్‌ వర్గీయులు బలవంతంగా దించేశారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్లు వేసేందుకు వేలమందిని తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్‌ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. సీఎం జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఈవోకు చంద్రబాబు లేఖ 

తిరుపతిలోకి బయటి వ్యక్తులు చొరబడ్డారని తెలియజేస్తూ ఫొటో ఆధారాలను జత చేసి సీఈవోకు తెదేపా అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. రెండు బస్సుల్లో వైకాపా నేతలు బయటి వ్యక్తుల్ని తరలించాలని లేఖలో పేర్కొన్నారు. వైకాపా నేతలు కొన్ని బూత్‌లలో తెదేపా ఏజెంట్లను అడ్డుకుంటున్నారని వివరించారు. స్థానికేతరులతో రిగ్గింగ్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తొట్టెంబేడు మండలం కందేలుగుంటలో  తెదేపా ఏజెంట్లను అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, బస్సులను తనిఖీ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి చంద్రబాబు సూచించారు. హోటళ్లు, లాడ్జీలు, ఫంక్షన్‌ హాళ్లపై అధికారులు నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు.

పోలింగ్‌ను బహిష్కరించిన ఊరందూరు గ్రామస్థులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఓట్లు వేసేందుకు గ్రామస్థులు ముందుకు రాకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోయింది. తమ పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేయరాదని నిరసనగా గ్రామస్థులు ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు ఓటు వేయడానికి ప్రజలు నిరాకరించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న గురుమూర్తి

తిరుపతి ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థి గురుమూర్తి.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన గురుమూర్తి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వివాదం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఇరు వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అరగంట సేపు పోలింగ్‌ నిలిచింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు సర్దిజెప్పారు. దీంతో పోలింగ్‌ తిరిగి ప్రారంభమైంది. 
 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని