ఇది రాజకీయ పరి‘వార్‌’

సామ్రాజ్యం.. అధికారం కోసం అన్నదమ్ములు, కుటుంబసభ్యుల కొట్లాట రాజుల కాలానికే పరిమితం కాలేదు. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ పదవుల కోసం సొంతవారిపైనే తిరుగుబాట్లు

Updated : 15 Jun 2021 17:51 IST

కుటుంబపోరుతో బలహీనపడుతున్న పార్టీలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సామ్రాజ్యం.. అధికారం కోసం అన్నదమ్ములు, కుటుంబసభ్యుల కొట్లాట రాజుల కాలానికే పరిమితం కాలేదు. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ పదవుల కోసం సొంతవారిపైనే తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నో రాజకీయ పార్టీలు ‘కుటుంబ పోరు’తో సతమతమవుతూనే ఉన్నాయి. నాటి గాంధీ-నెహ్రూ కుటుంబ పోరు నుంచి నేటి ఎల్‌జేపీ చీలిక వరకు జరిగిన రాజకీయ పరిణామాల విశ్లేషణే ఈ రాజకీయ పరి‘వార్‌’.

చిరాగ్‌ కొంపముంచిన ఒక్కమాట..

అబ్బాయిపై బాబాయి తిరుగుబాటు.. లోక్‌జనశక్తి పార్టీలో చీలికకు దారితీసింది. దళిత దిగ్గజం రాం విలాస్‌ తనయుడు చిరాగ్‌ పాసవాన్‌ను ఒంటరిని చేసింది. నిజానికి గతేడాది అక్టోబరులో రాంవిలాస్‌ మరణించిన కొద్ది రోజులకే చిరాగ్‌, ఆయన చిన్నాన్న పశుపతి కుమార్‌ పారస్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. రాం విలాస్‌ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చిరాగ్‌కు దక్కాయి. అయితే అతడి వ్యవహార శైలి, దుందుడుకు మనస్తత్వంతో పశుపతి అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్యా విభేదాలు రాగా.. ఒకానొక సమయంలో ఆవేశానికి లోనైన చిరాగ్‌.. పశుపతిని వేరు చేసి మాట్లాడారు. ‘నువ్వు మా రక్తసంబంధానివి కాదు’ అంటూ నోరుజారారు. ఆ మాటే పశుపతి తిరుగుబాటుకు కారణమైంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నీతీశ్ ప్రతీకార రాజకీయాలు కూడా దీనికి తోడయ్యాయి. గతేడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతూ చిరాగ్‌ తీసుకున్న నిర్ణయాన్ని పశుపతి తీవ్రంగా వ్యతిరేకించారు. చిరాగ్‌ నిర్ణయంతో ఆ ఎన్నికల్లో భారీగా నష్టపోయిన నీతీశ్ కుమార్‌కు ఈ విషయం ఉప్పందింది. దీంతో మరో నేతతో కథ నడిపించి పశుపతిని ఎదురుతిరిగేలా చేసినట్లు రాజకీయ విశ్లేషకుల భోగట్టా. ఏదేమైనా ఎన్డీయేతో చిరకాల మైత్రి ఉన్న ఎల్‌జేపీ.. ఇప్పుడు రెండుగా చీలిపోయింది.

ములాయం.. అఖిలేశ్‌.. మధ్యలో శివపాల్‌

ఉత్తరప్రదేశ్‌లో ఏళ్ల తరబడి అధికారాన్ని ఏలిన ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబంలోనూ అంతర్గత పోరు తప్పలేదు. 2016లో ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ములాయం తమ్ముడు శివపాల్‌ సింగ్‌ను అఖిలేశ్‌ రెండు సార్లు కేబినెట్‌ నుంచి తప్పించడంతో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొడుకును పక్కనబెట్టిన ములాయం.. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలనుకున్నారు.దీంతో  అసంతృప్తి చెందిన అఖిలేశ్‌ ఆ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. దీంతో కొడుకని కూడా చూడకుండా ములాయం.. అఖిలేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే పార్టీ నేతల ఒత్తిడితో 24 గంటలు తిరగకముందే తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆ వివాదాలు కొనసాగాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం అఖిలేశ్ మద్దతు కూడగట్టుకున్నారు. దీన్ని వ్యతిరేకించిన ములాయం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే ఈసీ నిర్ణయం అఖిలేశ్‌కు అనుకూలంగా రావడంతో ఆయనే ఎస్పీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో తండ్రీకొడుకులు కలిసిపోగా.. శివపాల్‌ పార్టీ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే ములాయం కుటుంబ విభేదాలు అసెంబ్లీ ఎన్నికల్లో పెను ప్రభావమే చూపించాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 

చిన్నకొడుకుకు పదవి.. పెద్ద కొడుకుపై వేటు

తమిళ దిగ్గజ నేత, కలైంజర్‌ కరుణానిధి కుటుంబంలోనూ పదవి కోసం పోట్లాటలు జరిగాయి. డీఎంకే చీఫ్‌ కరుణానిధి 2013లో తన రాజకీయ వారసుడిగా చిన్న కుమారుడు స్టాలిన్‌ పేరును ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పెద్ద కుమారుడు అళగిరి బహిరంగంగానే వ్యతిరేకించారు. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2014లో అళగిరిని  రెండేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన అళగిరి.. కరుణానిధిపై కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్దమయ్యారు. అయినప్పటికీ కలైంజర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరోవైపు కరుణానిధి కుమార్తె కనిమొళి మాత్రం స్టాలిన్‌కు మద్దతు ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి స్టాలిన్‌ తొలిసారి సీఎం అయ్యారు. అయితే డీఎంకే పదేళ్ల పాటు అధికారానికి దూరమవడానికి ఈ విభేదాలు కూడా ఓ ప్రధాన కారణమే.

సీఎం పీఠంపై కొడుకు.. దేవెగౌడకు నచ్చలేదు..

భారత మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఒకానొక సమయంలో తన కుమారుడు కుమారస్వామిపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. 2006లో జేడీఎస్‌.. కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా ధరమ్‌సింగ్‌కు దేవేగౌడ మద్దతు ప్రకటించారు. అయితే తండ్రి విధానాలను వ్యతిరేకించిన కుమారస్వామి.. రహస్యంగా ప్రతిపక్ష భాజపాతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేశారు. దంతో ధరమ్‌ సింగ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత భాజపాతో పొత్తు పెట్టుకుని కుమారస్వామి సీఎం అయ్యారు. కొడుకు వ్యవహారం నచ్చని దేవేగౌడ.. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. కొన్నాళ్ల పాటు ఆయనతో మాట్లాడలేదు. అయితే భాజపా కుమారస్వామి బంధం ఎంతోకాలం నిలువలేదు. దీంతో ఆయన మళ్లీ తండ్రి గూటికి చేరుకున్నారు. 

నెహ్రూ కుటుంబంలో చీలిక..

1980ల్లో ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మరణం తర్వాత వారి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. కోడలు మేనకా గాంధీ కుటుంబం నుంచి బయటకొచ్చారు. 1984లో అమేఠీ నుంచి రాజీవ్‌గాంధీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మేనక, ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ భాజపాలో చేరారు. ఎన్డీయే ప్రభుత్వంలో మేనక కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. 

ఇవేగాక, మహారాష్ట్రలోని ఠాక్రే కుటుంబంలోనూ అంతర్గత పోరు నడుస్తోంది. శివసేన బాధ్యతలు ఉద్ధవ్‌ ఠాక్రేకు అప్పగించడంపై అసంతృప్తి చెందిన బాల్‌ఠాక్రే సోదరుడి కుమారుడు రాజ్‌ ఠాక్రే పార్టీ నుంచి విడిపోయారు. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. హరియాణాలోని చౌతలా కుటుంబం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుటుంబంలోనూ రాజకీయ విభేదాలు తలెత్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని