Farm laws: యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ వ్యవసాయ చట్టాలు.. సాక్ష్యం ఇదే: ఎస్పీ

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ అనుమానం వ్యక్తంచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాటిని మళ్లీ తెస్తారని ఆరోపించింది.

Updated : 22 Nov 2021 04:51 IST

లఖ్‌నవూ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ అనుమానం వ్యక్తంచేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాటిని మళ్లీ తెస్తారని ఆరోపించింది. రాజస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యలను ఉటంకించింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్న వేళ సమాజ్‌ వాదీ పార్టీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేసింది.
‘‘చట్టాల రద్దు వారు హృదయపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదు. యూపీ ఎన్నికల తర్వాత ఆ చట్టాలను మళ్లీ తెస్తారు. ఆ విషయాన్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రాజస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, భాజపా ఎంపీ సాక్షి మహరాజే స్వయంగా చెప్పారు. రైతులకు ప్రధాని ఉత్తుత్తి క్షమాపణ చెప్పారు. 2022లో ఈ చట్టాలు మళ్లీ తెస్తారు’’ అని సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్‌ చేసింది.

శనివారం ఓ కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా మాట్లాడుతూ.. చట్టాలు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని మళ్లీ తెస్తుందని వ్యాఖ్యానించారు. సాక్షి మహరాజ్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘బిల్లులు వస్తాయి.. పోతాయి. మళ్లీ వస్తాయి. దీనికి పెద్ద సమయం పట్టదు’’ అని అన్నారు. యూపీ ఎన్నికలకు చట్టాల రద్దుకు సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు చట్టాలు రద్దు పూర్తయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నాయకులు పేర్కొన్నారు.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని