Kejriwal: గుజరాత్‌లో ఓటమి భయంతోనే.. ఆప్‌ అణచివేతకు భాజపా ప్రయత్నం

గుజరాత్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయం భాజపాను వెంటాడుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 19 Sep 2022 01:15 IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: గుజరాత్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Polls) ఓటమి పాలవుతామనే భయం భాజపాను వెంటాడుతోందని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొన్నారు. అందుకే అవినీతిపై పోరాడుతున్నామని చెబుతూ ఆమ్‌ఆద్మీని అణచివేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నికైన ఆప్‌ ప్రతినిధులతో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్‌.. తమ పార్టీకి (AAP) చెందిన మంత్రులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

‘గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీకి పెరుగుతోన్న ఆదరణకు చూసి భాజపా (BJP) జీర్ణించుకోలేకపోతోంది. దీంతో తమ పార్టీ మంత్రులు, నేతలపై తప్పుడు అవినీతి కేసులు పెడుతోంది. వీటితోపాటు గుజరాత్‌లో తమ పార్టీకి కవరేజ్‌ ఇవ్వవద్దంటూ టీవీ ఛానళ్ల ఓనర్లు, వారి ఎడిటర్లకు ప్రధాని సలహాదారుడు హిరేన్‌ జోషి నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఇటువంటి చర్యలను ఆపండి. ’ అని భాజపాపై అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్‌లో ఈసారి ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌.. కేవలం నిజాయితీ లేని వ్యక్తులు మాత్రమే ప్రజలకు ఉచితాలు ఇవ్వడం దేశానికి మంచివి కావని వాదిస్తారని అన్నారు.

ప్రపంచంలో నంబర్‌ 1గా నిలబెట్టాలంటే..

భారత్‌ను ప్రపంచంలో నంబర్‌1 దేశంగా నిలబెట్టాలంటే 130 కోట్ల మంది మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని  పార్టీ శ్రేణులకు అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆరు పాయింట్ల అజెండా ముఖ్యమన్నారు.

* ప్రతి ఒక్కరికీ మెరుగైన ఆరోగ్య వసతులు

* ఐదేళ్లలో పేదరికాన్ని తగ్గించడం

* యువతకు ఉపాధి కల్పన

* మహిళలకు భద్రత, సమాన అవకాశాలు

* ప్రపంచస్థాయి మౌలిక వసతులు

* రైతులు పండించిన పంటలకు పూర్తి ధర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని