Rahul Gandhi: భారత్‌ జోడో యాత్ర రేపు ముగింపు..!

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ( Rahul Gandhi) చేపట్టిన భారత్‌  జోడో యాత్ర రేపు శ్రీనగర్‌లో ముగియ నుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి.   

Updated : 29 Jan 2023 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తుది అంకానికి చేరింది. చివరి రోజు యాత్ర నేడు శ్రీనగర్‌లోని పఠాన్‌ చౌక్‌ నుంచి ఉదయం 10.45కు ప్రారంభమైంది. రాహుల్‌ తన ట్రేడ్‌మార్క్‌ తెల్ల టీషర్ట్‌ వేసుకొని యాత్రలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆయనతోపాటు నడిచారు. నేడు యాత్ర ఏడు కిలోమీటర్లు సాగి సోన్‌వార్‌కు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు ఆగి లాల్‌చౌక్‌కు బయల్దేరుతుంది. 

రాహుల్‌ యాత్రను దృష్టిలోపెట్టుకొని లాల్‌చౌక్‌ ప్రాంతంలో అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం మొత్తాన్ని భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకొన్నాయి. లాల్‌ చౌక్‌ నుంచి యాత్ర నెహ్రూపార్క్‌కు చేరుకొని ముగియనుంది. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్‌ ఈ యాత్రను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాలను దాటుకొని శ్రీనగర్‌ చేరుకున్నారు.

రేపు భారత్‌ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో 12 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 21 పార్టీలకు ఆహ్వానాలు పంపగా.. కొన్ని పార్టీలు వివిధ కారణాలతో హాజరుకావడంలేదని తెలుస్తోంది. హాజరుకాని వాటిల్లో టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఉన్నాయి. డీఎంకే నుంచి ఎంకే స్టాలిన్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే, , నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నాయకులు పాల్గొనే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని