Gujarat Polling: కొనసాగుతున్న గుజరాత్‌ పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్‌ గురువారం కొనసాగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 01 Dec 2022 16:17 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్‌ గురువారం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.48 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల పరిధిలోని 89 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ భావ్‌నగర్‌లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో భాజపా సరికొత్త రికార్డు సృష్టిస్తుందని కేంద్రమంత్రి.. కాషాయ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

* క్రికెటర్‌ రవీంద్ర జడేజా, తండ్రి అనిరుధ్‌ సిన్హ్‌, ఆయన సోదరి నైనా జడేజా జామ్‌నగర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణి రీవాబా రాజ్‌కోట్‌లో ఓటేశారు. రీవాబా ఈ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తుండగా.. జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

* కేంద్ర మంత్రులు పురుషోత్తమ్‌ రూపాలా, దర్శన జర్దోష్‌, రాజ్‌కోట్‌ రాజకుటుంబానికి చెందిన మంధతాసిన్హ్‌ జడేజ్‌ ఠాకోర్ సాహెబ్‌ దంపతులు, కాంగ్రెస్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ కుమార్తె ముంతాజ్‌ పటేల్‌ తదితరులు తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని