UP Election: ‘తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయి’

ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న...

Published : 07 Feb 2022 01:44 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయని ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కర్హల్‌ స్థానంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం అఖిలేశ్‌ తొలిసారి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే ఇప్పటివరకు మూసి ఉన్న భాజపా ప్రభుత్వ కళ్లు, చెవులు.. మొదటి దశ ఎన్నికల్లోనే తెరుచుకుంటాయన్నారు.

అంతకుముందు ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ అఖిలేష్‌ ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ శక్తిమంతమైన పోటీదారుగా అవతరించిన నేపథ్యంలో పార్టీకి ఓటేయద్దొంటూ కొందరు ప్రజలను ఫోన్‌లలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. యూపీ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ రక్షణకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ‘భాజపా ఏదైనా చేయొచ్చు.. అది చేసే వరకు ఎవరికీ తెలియదు. నోట్ల రద్దుపై ఎవరికైనా సమాచారం ఉందా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్లు, రంగులు మాత్రమే మార్చగలరని, కాబట్టి మనం కూడా కొంత మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు లతా మంగేష్కర్‌ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లతా దీదీ పేరిట ఏదైనా చేస్తామని చెప్పారు. యూపీలో ఈ నెల 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని