Andhra News: ఒంగోలులో ఫ్లెక్సీల గొడవ.. బాలినేని, వైవీ సుబ్బారెడ్డి చిత్రాలున్నవి తొలగింపు

ఒంగోలులో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చిత్రాలున్న ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే తొలగించడం చర్చనీయాంశమైంది.

Updated : 15 Jan 2023 07:55 IST

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలులో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చిత్రాలున్న ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే తొలగించడం చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీపై వైవీ సుబ్బారెడ్డి ఫొటో ఉండటం నచ్చని బాలినేని వర్గీయులు వాటిని తొలగించేలా చేసినట్లు తెలిసింది. స్థానిక వైకాపా నాయకులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిలో బాలినేని, వైవీ చిత్రాలను ముద్రించారు. వై.వి.సుబ్బారెడ్డి చిత్రాలు ఉండటంతో ఆగ్రహించిన బాలినేని వర్గీయులు నగర పాలక అధికారులకు చెప్పి శుక్రవారం రాత్రి వాటిని తొలగింపజేసినట్లు సమాచారం. తొలగించిన వాటిని కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో ఓ మూలకు పడేశారు. నగరంలో ద్వితీయశ్రేణి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలున్నా.. కేవలం వీటినే తొలగించడం చర్చనీయాంశంగా మారింది. బాలినేని, వై.వి.సుబ్బారెడ్డి వర్గాల మధ్య తొమ్మిదేళ్లుగా వైరం నడుస్తోంది. తితిదే ఛైర్మన్‌గా కీలక బాధ్యతల్లో ఉన్న సుబ్బారెడ్డి ఒంగోలుకు వచ్చిన సందర్భాల్లో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వాటిని తొలగించడం పరిపాటిగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని