Karnataka Assembly Elections: 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు రికార్డు స్థాయి విజయం

దాదాపు 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ రికార్డు స్థాయి విజయం సాధించింది. 136 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 

Published : 14 May 2023 01:43 IST

దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly Elections) 136 స్థానాల్లో విజయం సాధించి ఏ పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 57 స్థానాలను అధికంగా కైవసం చేసుకుంది. మొత్తం 42.9శాతం ఓట్‌ షేర్‌ను సొంతం చేసుకుంది. అయితే 1999లోనూ కాంగ్రెస్‌  ఈ తరహా ఫలితాలను సాధించింది. అప్పట్లో 40.84 ఓట్‌ షేర్‌తో 132 స్థానాల్లో గెలుపొందింది. 1989 ఎన్నికల్లో ఏకంగా 43.76 ఓట్‌ షేర్‌తో 178 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. తాజా ఎన్నికల్లో భాజపా 36 శాతం ఓట్‌ షేర్‌తో 65 స్థానాల్లో గెలుపొందగా.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ 13.3శాతం ఓట్‌ షేర్‌తో 19 స్థానాలను దక్కించుకుంది. 120కి పైగా సీట్లు సాధిస్తామంటూ గతంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పిన దాని కన్నా 16 సీట్లను అధికంగానే కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది.

ఈ విజయం కన్నడ ప్రజలదే: ఖర్గే

కాంగ్రెస్‌ సాధించిన ఈ అపూర్వ విజయం యావత్‌ కన్నడ ప్రజలదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘136 స్థానాల్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజా తీర్పును శిరసావహిస్తాం, ప్రజల ఆకాంక్షలకు, వారు తమపై పెట్టిన నమ్మకానికి అనుగుణంగా పని చేస్తామ’ని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ చెప్పారు. కాంగ్రెస్‌ ఇంతటి ఘన విజయానికి రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రే కారణమని ఖర్గే  వెల్లడించారు.  రాహుల్‌ గాంధీ జోడో యాత్ర సాగిన దాదాపు అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించిందని అన్నారు. ఈ విజయం వచ్చే ఏడాది రానున్న సార్వత్రిక ఎన్నికలతోపాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు నూతన ఉత్తేజాన్నినింపిందని  అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు