Kiren Rijiju: రాహుల్‌ ‘పప్పూ’ అని వాళ్లకు తెలియదుగా.. కిరణ్‌ రిజిజు వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ఘాటు విమర్శలు చేశారు. ఆయన పప్పూ అన్న విషయం విదేశీయులకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయన తెలివితక్కువ వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యంగ్యాస్త్రలు గుప్పించారు.

Published : 09 Mar 2023 20:08 IST

దిల్లీ: బ్రిటన్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)..  భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ విదేశీ గడ్డపై ఆయన చేసిన వ్యాఖ్యలను భాజపా (BJP) నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) స్పందిస్తూ.. రాహుల్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన ‘పప్పూ (Pappu)’ అన్న విషయం విదేశీయులకు తెలియదు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. భారత ఐక్యతకు ఆయన అత్యంత ప్రమాదకరంగా మారారంటూ వరుస ట్వీట్లలో దుయ్యబట్టారు.

రాహుల్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసిన కిరణ్‌ రిజిజు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘ఈ స్వయం ప్రకటిత కాంగ్రెస్‌ (Congress) యువరాజు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. భారత ఐక్యతకు ఆయన అత్యంత ప్రమాదకరంగా మారారు. ఇప్పుడు ఆయన భారత్‌ను విభజించేందుకు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ‘పప్పూ’ అన్న విషయం భారత ప్రజలకు తెలుసు కానీ.. విదేశీయులకు ఆ విషయం తెలియదుగా..! వాస్తవానికి ఆయన చేసిన తెలివితక్కువ వ్యాఖ్యలకు స్పందించడం కూడా అనవసరం. కానీ, భారత్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసి మన దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశం ఉంది’’ అని రిజిజు (Kiren Rijiju) మండిపడ్డారు. భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) దేశ ప్రజలందరి అభిమాన నేత అని, ఆయన ఏకైక మంత్రం ‘ఏక్‌ బారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

యూకే పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ.. ఇటీవల కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా భారత ప్రజాస్వామ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూస్తూ ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్‌ నేత పరాయి గడ్డపై దేశం పరువు తీస్తున్నారని ధ్వజమెత్తింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు