Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌ గూటికి పోచారం

మాజీ శాసనసభాపతి, భారాస సీనియర్‌ నాయకుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. కొందరు భారాస ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.

Published : 22 Jun 2024 03:08 IST

మాజీ సభాపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
పార్టీలోకి ఆహ్వానం.. సముచిత గౌరవమిస్తామని వెల్లడి
పొంగులేటి, జానారెడ్డిలతో మరో భారాస ఎమ్మెల్యే భేటీ

కాంగ్రెస్‌ పార్టీలోకి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ శాసనసభాపతి, భారాస సీనియర్‌ నాయకుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. కొందరు భారాస ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. సీనియర్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు కుమారులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ తదితరులతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోచారం ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రికి, మంత్రికి పోచారం కుటుంబ సభ్యులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై చర్చించుకొన్నారు. సమావేశం తర్వాత పోచారంతోపాటు ఆయన కుమారులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి సీఎం కాంగ్రెస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగానే పోచారంతో అన్ని అంశాలు చర్చించి చేరడానికి సిద్ధం కావడంతో ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు భారాసకే చెందిన ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, మాజీ మంత్రి జానారెడ్డిలను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు లక్ష్మారెడ్డి చెప్తున్నా, పోచారం కాంగ్రెస్‌లో చేరిన రోజే ఆయన కూడా కాంగ్రెస్‌లోనూ, ప్రభుత్వంలోనూ ముఖ్యనేతలను కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన పలువురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వారి పేర్లతో సహా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తాజాగా ప్రకటించడం గమనార్హం. త్వరలోనే మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 


జానారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఉప్పల్‌ భారాస ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పక్కన ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి

ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరాం: రేవంత్‌రెడ్డి

పోచారం చేరిక సందర్భంగా ఆయన ఇంటి వద్ద సీఎం మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశాం. పెద్దలుగా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరాం. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారు. అన్నదాతల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం. రైతు రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఆయన చేరారు. భవిష్యత్తులో శ్రీనివాస్‌రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం. నిజామాబాద్‌ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటాం. ఇది రైతు సంక్షేమ రాజ్యం. వారి కోసం అవసరమైన అందరినీ కలుపుకొని పోతాం’’ అని చెప్పారు. 

రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి: పోచారం

పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరుగుతున్న పరిణామాలను గమనించి వారిని మనఃస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించా. రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి, రైతు సంక్షేమంతోపాటుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో సమస్యలు సహజం. అయినప్పటికీ చిన్న వయసులోనే రేవంత్‌రెడ్డి ధైర్యంగా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. వారిని, రాష్ట్ర మంత్రి వర్గాన్ని అభినందిస్తున్నా. నా జీవితంలో రాజకీయంగా ఆశించడానికి ఇంకా ఏమి లేదు. నేను ఆశించేది రైతుల సంక్షేమమే. నా రాజకీయ జీవితం తొలుత కాంగ్రెస్‌ పార్టీతోనే మొదలైంది. తరవాత తెలుగుదేశం, భారాసలో పనిచేశా. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చా. రేవంత్‌రెడ్డికి ఇంకా ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉంది. ఆయన చేస్తున్న మంచి పనులు నాకు వ్యక్తిగతంగా నచ్చి వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని