
Punjab Polls: భాజపాలో చేరిన మాజీ క్రికెటర్.. కాంగ్రెస్కూషాక్!
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమలదళంలోకి..
దిల్లీ: మరికొన్ని నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా భాజపాలో చేరారు. అలాగే, కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫతేహ్ సింగ్ భజ్వా, బల్విందర్ సింగ్ లడ్డీ ఈరోజు కమలదళంలో చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ ముగ్గురినీ గజేంద్రసింగ్ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి సభ్యత్వ రసీదును అందజేశారు. అనంతరం గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. పంజాబ్లో తమ పార్టీ పుంజుకోవడంతో ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే భాజపాలో చేరుతున్నట్టు మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా చెప్పారు. దేశ అభివృద్ధి కోసం భాజపా కంటే మరే ఇతర పార్టీ పనిచేయలేదన్నారు.
ఖాదియన్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన భజ్వా.. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ భజ్వా సోదరుడు. మరోవైపు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా భాజపా అగ్రనేతలతో కలిసి వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు అధికారిక పొత్తులు ప్రకటించిన మరుసటి ఈ చేరికలు చోటుచేసుకోవడం గమనార్హం.
► Read latest Political News and Telugu News