Farooq Abdullah: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న ఫరూక్‌ అబ్దుల్లా

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. యువత ఆస్థానం కోసం పోటీ పడవచ్చని పేర్కొన్నారు. 

Published : 18 Nov 2022 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌కు చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘‘పార్టీ అధ్యక్ష పదవికి ఇక పోటీచేయను. ఈ పోస్టుకు డిసెంబర్‌ 5వ తేదీన ఎన్నిక జరుగుతుంది. కొత్తతరం బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. నాకు 86 సంవత్సరాలు. పార్టీలో ఎవరైనా ఈ స్థానం కోసం పోటీ పడవచ్చు. ఇది ప్రజాస్వామ్య విధానం’’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. 

ఫరూక్‌ 1981లో తొలిసారి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షపదవికి ఎన్నికయ్యారు. కానీ, 2002లో ఆ స్థానంలోకి ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా వచ్చారు. 2006లో తిరిగి ఫరూక్‌ ఆ పదవిని చేపట్టారు. తాజాగా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి వైదొలగుతున్నా.. స్థానిక పార్టీల కూటమి అయిన గుప్కార్‌ అలయన్స్‌కు అధ్యక్షత వహిస్తానని చెప్పారు. కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిపై ఈ సంస్థ పోరాడుతోంది. ఇటీవల ప్రముఖ వైద్య నిపుణుడు ఉపేంద్ర కౌల్‌ రాసిన ‘ వెన్‌ ది హార్ట్‌ స్పీక్స్‌.. మెమొరీస్‌ ఆఫ్‌ కార్డియాలజిస్ట్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలు భయం లేకుండా జీవించగలిగే పరిస్థితులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 1990 సమయంలో జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్లు పాగా వేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయని, మతపరమైన విభేదాలు చోటు చేసుకున్నాయని, వీటి గురించి కూడా పుస్తకంలో ప్రస్తావించారని అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని