Pocharam Srinivas Reddy: భారాసకు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం

తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 21 Jun 2024 14:24 IST

హైదరాబాద్‌: భారాసకు షాక్‌ తగిలింది. తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన కుమారుడూ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం రేవంత్‌, పోచారం మీడియాతో మాట్లాడారు. 

రైతు సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలందించారు: సీఎం రేవంత్

రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదని.. పండగ చేసే బాధ్యత తమదని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్తామన్నారు. 

పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి: పోచారం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని.. సీఎం రేవంత్‌ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానని పోచారం తెలిపారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతుబిడ్డనని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. ‘‘సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. నా జీవితంలో ఆశించేది రైతు సంక్షేమం తప్ప ఇంకేమీ లేదు. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాను. అందరి సహకారంతో రాష్ట్ర భవిష్యత్‌ కోసం పనిచేస్తాం. నా రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌తో. ఆ తర్వాత తెదేపా, భారాసలో పనిచేశాను. రేవంత్‌ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరాను. 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకు ఉంది. మాకు వయసైపోయింది.. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి’’ అని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని