CM Revanth reddy: ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.

Updated : 18 Jun 2024 18:25 IST

హైదరాబాద్‌: మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయి. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వాటిని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే నిర్ణయించాం. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారి విలువైన కాలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టాం. నేను ఇల్లు కట్టుకునే సమయంలో ఇంజినీరింగ్ గ్రాడుయేట్స్‌ వచ్చి రూ.15 వేలు, రూ.20 వేలకు పనిచేస్తామని వచ్చారు. అదే మేస్త్రీలు, నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారిని సంప్రదిస్తే రూ.60 వేలు అడిగారు. 

సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచడం లేదని అప్పుడే అర్థమైంది. అందుకే ఎంతోమంది గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఇక్కడే అలాంటి ఉపాధి అవకాశాలు కల్పించి ఎవరూ విదేశాలకు వెళ్లకుండా చేస్తాం. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందించాలని భావిస్తున్నాం. ఈ ప్రయత్నంలో తోడ్పడేందుకు ముందుకొచ్చిన టాటా సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం నలుమూలలా 65 ఐటీఐలను అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. ముఖ్యమంత్రిగా నేను ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తా. ప్రతి నెలా సమీక్ష చేస్తా’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునికీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చుచేయనుంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ అప్‌గ్రేడ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చనుంది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం అధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటా 15, 860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ లభించనుంది. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు కాగా.. టీటీఎల్‌ వాటా రూ.2016.25 కోట్లు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్‌ ఉద్యోగాలు కల్పించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని